ఇమామ్‌లు, మౌజన్ల గౌరవ వేతనాలపై సమగ్ర విచారణ చేపట్టాలి

02-11-2026 | 11:52pm
  1. మసీదు కమిటీల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
  2. రాష్ట్ర మైనారిటీ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా మసీదుల్లో(Mosques) సేవలందిస్తున్న ఇమామ్‌లు, మౌజన్లకు ప్రభుత్వం అందిస్తున్న గౌరవ వేతనాల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా(MD Yaqoob Pasha, President of the Telangana State Minority Association) ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18 వేల మంది ఇమామ్‌లు, మౌజన్లకు నెలకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనాలు అందిస్తోందని తెలిపారు.అయితే కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదులుగా మసీదు కమిటీ సభ్యుల ఖాతాల వివరాలను వక్ఫ్ బోర్డుకు సమర్పిస్తున్నారని, మరికొన్ని చోట్ల అర్హులకు అందాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు.తక్కువ వేతనాలతో మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్‌లు,మౌజన్లకు ఈ గౌరవ వేతనాలు ఎంతో ఆసరాగా ఉంటాయని పేర్కొన్నారు.

వారి హక్కుగా అందాల్సిన నిధులను దుర్వినియోగం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో వక్ఫ్ బోర్డు అధికారులు,మసీదు కమిటీల మధ్య కుమ్మక్కు ఉందన్న ఆరోపణలపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏసీబీ, రాష్ట్ర ఇంటిల్ జెన్సీ  అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని, అక్రమాలు రుజువైతే బాధ్యులైన మసీదు కమిటీ సభ్యులు, సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

అర్హులైన ఇమామ్‌లు, మౌజన్ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా గౌరవ వేతనాలు జమయ్యేలా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ఆ శాఖ కార్యదర్శితో పాటు, ఏసీబీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు లేఖలు పంపినట్లు యాకూబ్ పాషా వెల్లడించారు.

మరిన్ని వార్తలు