గంజాయి నివారణకు సహకరించాలి
- బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్
- బెల్లంపల్లి బస్తీలోపోలీసుల తనిఖీలు
బెల్లంపల్లి: గాంజా నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని,అక్రమ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్(Bellampalli ACP Kiran Kumar) అన్నారు. బెల్లంపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి బెల్లంపల్లి బస్తీలో టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ హాజరై స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో శాంతిభద్రతల పరిస్థితులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఆరా తీసి, నేరాల నియంత్రణకు పోలీసులు చేపడుతున్న చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా పోలీసులు కాలనీలోని ఇళ్లను తనిఖీ చేసి నివాసితుల వివరాలను పరిశీలించారు. అలాగే వాహన తనిఖీలు నిర్వహించి సుమారు 80 వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. సంబంధిత వాహనదారులు సరైన ధ్రువపత్రాలను సమర్పించిన అనంతరం నిబంధనల ప్రకారం వాహనాలను అప్పగిస్తామని, లేని పక్షంలో చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు.
కాలనీలో లేదా పరిసర ప్రాంతాల్లో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానం కలిగితే ప్రజలు భయపడకుండా వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకుండా వాటి నియంత్రణలో పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ-చలాన్లు లేదా ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయనే కారణంతో వాహనాలకు నంబర్ ప్లేట్లు తొలగించి తిరగడం చట్టవిరుద్ధమని తెలిపారు.
ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను కలిగి ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కాలనీలో స్వీయ రక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ హనోక్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.