రేపు ప్రధానితో సీఎం భేటీ

14-11-2026 | 05:05am
  1. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు
  2. కేంద్ర సాయం కోరేందుకే సమావేశం
  3. రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులను మోదీకి చెప్తాం
  4. సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  5. భూగర్భ జలాల పరిరక్షణకు రాష్ట్రవ్యాప్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రకటన
  6. వాటర్‌షెడ్ల వారీగా నీటి లెక్కలు తీయాలి.. పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ వేయాలి
  7. ప్రొఫెసర్ వీరేంద్ర తివారీ సూచనలు

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఎల్ నినో పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ సాయం కోరనుంది. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి, తాను భేటీ అవుతామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సాయం కోరుతామని, రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

ఎల్ నినో వల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నదని ఆయన వెల్లడించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వెలికితీతను నియంత్రించడం, అందుబాటులో ఉన్న జలవనరులను సుస్థిరంగా వినియోగించుకోవడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలని ఆయన వివరించారు.

యాసంగికి ముందే నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేసి, తక్కువ నీటితో సాగయ్యే పంటలపై రైతులకు మార్గనిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. భూగర్భ జలాల పరిస్థితిపై శుక్రవారం సచివాలయంలోని తన కార్యాల యంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులు, నిపుణులతో ఉత్తమ్ సమీక్షించారు. రాష్ట్రంలో భూగర్భజలాల స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తామని, దాని ఆధారంగా అధికారులతో చర్చించి శాఖల సమన్వయంతో కార్యాచరణను రూపొందిస్తామని ఆయన తెలిపారు. 

ప్రత్యామ్నాయ పంటలే మేలు: తివారీ

సీఎస్‌ఐఆర్ నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణుడు, ఐఐటీ హైదరాబాద్ అనుబంధ ఆచార్యుడు వీరేం ద్ర తివారీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. భూగర్భ జలాల అంచనా కమిటీ (జీఈసీ) నమూనాను ఉపయోగించి వర్షపాత గణాంకాలను భూగర్భ జల నిల్వలతో పోల్చి తక్షణమే అంచనా వేయాలని ఆయన సూచించారు. తెలంగాణలో మొత్తం నీటి వినియోగంలో 94 శాతానికి పైగా సాగుకే వెళ్తున్నదని.. గృహావసరాలు, ఇతర వినియోగాల వాటా సుమారు 1.8 శాతమని ఆయన పేర్కొన్నారు.

ప్రతి వాటర్ షెడ్ (జల పరీవాహక ప్రాంతం) పరిధిలో భూగర్భ జలాల లభ్యత ఎంత, సాగుకు అవసరమైన నీరు ఎంత అనే వివరాలను పటాల రూపంలో పొందుపరచాలన్నారు. ఆ వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాలకు అనువైన పంటలను రైతులకు సూచించాలని చెప్పారు. తగినంత నీటి నిల్వలున్న ప్రాంతాల్లో వరి సాగుకు అవకాశం ఉంటుందని, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తివారీ సూచించారు. ఆయా పంటల సాగుతో ఎంత ఆదాయం పొందవచ్చో ప్రభుత్వం రైతులకు వివరించాలన్నారు. 

పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ప్రతిపాదన 

పరిమిత సంఖ్యలో సభ్యులతో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, అది నేరుగా రాష్ట్ర నాయకత్వానికి నివేదించేలా చూడాలని వీరేంద్ర తివారీ ప్రతిపాదించారు. వారానికోసారి, పది రోజులకోసారి లేదా రెండు వారాలకోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలను సమన్వయం చేయాలన్నారు. ఈ సూచనలపై స్పందించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. భూగర్భ జలాల శాఖను బలోపేతం చేయడంపై విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు. శాఖకు అవసరమైన మౌలిక వసతులు, నిధులు, సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించే అంశాలను పరిశీలిస్తామన్నారు.

తక్కువ వర్షపాతం నమోదయ్యే ఇజ్రాయెల్ తదితర దేశాలు అందుబాటులో ఉన్న ప్రతి వానచుక్కను ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకుంటున్న తీరును ప్రస్తావించా రు. తెలంగాణలోనూ ఆ విధానాన్ని అనుసరించాలన్నారు. వచ్చే వర్షాకాలం వరకు జల సంరక్షణను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు  బాధ్యతగా తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో వర్షపాతం తగ్గినా పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పటిష్ఠమైన వ్య వస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. సమీక్షలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఈఎన్సీ (జనరల్) ఓవీ రమేశ్‌బాబు, సంయుక్త కార్యదర్శి కే శ్రీనివాస్, భూగర్భ జలాల శాఖ డైరెక్టర్ కృష్ణ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు