కేసీఆర్‌ను ప్రశ్నించిన కవిత

13-11-2026 | 03:08pm

సిద్దిపేట: తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిద్దిపేట పర్యటన(Kavitha Siddipet Tour) రాజకీయంగా ఆసక్తి రేపింది. జిల్లాలో పార్టీ కార్యకలాపాలకు శ్రీకారం చుడుతూ, నూతన కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)ను లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు చేశారు.

ఫామ్‌హౌస్ నీటి వ్యవహారంపై విచారణ కోరిన కవిత

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటిని మళ్లించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని కవిత డిమాండ్ చేశారు. ఫామ్‌హౌస్‌కు ప్రత్యేకంగా కాలువ ఉందా? లేదా? అనే విషయాన్ని బీఆర్‌ఎస్ నేతలు ప్రజలకు స్పష్టం చేయాలని కోరారు. తన ఆస్తుల విషయంలోనూ పారదర్శకతకు సిద్ధమని, అఫిడవిట్‌లో వెల్లడించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా ప్రజలకు రాసిస్తానని సవాల్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతితో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

హరీశ్‌రావుపై రాజకీయ పోరు

సిద్దిపేటలో హరీశ్‌రావును ఓడించడమే లక్ష్యమని కవిత ప్రకటించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు సంబంధించి ఐదు ఎకరాల వ్యవహారంలో హరీశ్‌రావు, ఆయన అనుచరులపై ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఈ నెల 19న సీఎం సిద్దిపేటకు వస్తున్న నేపథ్యంలో హరీశ్‌రావుపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.

కొత్త రాజకీయాలకు అవకాశం ఇవ్వాలి

చాలాకాలంగా కేసీఆర్, హరీశ్‌రావులకు ప్రజలు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు కొత్త నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కవిత కోరారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు బీఆర్‌ఎస్ పాలనలో అన్యాయం జరిగిందని, మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం అందించడంలో జాప్యం జరిగిందని విమర్శించారు.

సిద్దిపేటలో టీఆర్‌ఎస్ గెలుపుపై ధీమా

సిద్దిపేట తన సొంత జిల్లాగా పేర్కొన్న కవిత, ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేటలో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు తనపై విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు