నిరుద్యోగులను కొడుతుంటే నిద్రపోయారా?
- విద్యార్థులపై లాఠీచార్జ్ చేసినప్పుడు రాహుల్‌గాంధీ ఎక్కడున్నరు!
- పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చినప్పుడు ఢిల్లీలో ఏం చేస్తున్నరు?
- ప్రజా ధనం 100 కోట్లతో ప్రచార ఆర్భాటం దేనికి?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఉద్యోగాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగులపై పోలీసులతో దాడులు చేయించినప్పుడు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎక్కడున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. రాహుల్ గాంధీ శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్ర భుత్వంపై కేటీఆర్ తన ‘ఎక్స్’ ఖాతాలో పలు విమర్శలు చేశారు. లగచర్లలో గిరిజన మహిళలపై దాడులు చేసి, వారి దుస్తులు చింపి అవమానించిన ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
‘హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసినప్పుడు రాహుల్ ఢిల్లీలో నిద్ర పోతున్నారా? కంచ గచ్చిబౌలి హెచ్‌సీయూ భూముల్లో రాత్రికి రాత్రే 10 వేలకుపైగా చెట్లను నరికివేసి, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేసినప్పుడు, కేబీఆర్ పార్కు విషయంలోనూ రాహుల్ గొంతు ఎందుకు పెగల్లేదు?’ అని నిలదీశారు. ‘మహిళా ప్రజాప్రతినిధుల చీరలు లాగి, అసెంబ్లీ ఎదుట దాడులు చేసిన ఘటనలపైనా కనీసం స్పందించలేదు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల బలవన్మరణాలు, జర్నలిస్టుల అరెస్టులు, భూకబ్జాలపై ప్రశ్నించడానికి రాహుల్‌కు సమయం లేదా?’ అని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజా సమస్యలు ఎదురైనప్పుడు మౌనం వహించి, ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రజల సొమ్ముతో రూ.100 కోట్ల ప్రచార ఆర్భాటం కోసం హైదరాబాద్‌కు రావడం సిగ్గుచేటని విమర్శించారు.