సిద్దిపేటలో రాజకీయ పాగా వేస్తా
మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్మాణాలపై విచారణ: కవిత డిమాండ్
సిద్దిపేటలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ
సిద్దిపేట, నవంబర్ 13 (విజయక్రాంతి): తాను పుట్టి, పెరిగిన సొంతగడ్డ సిద్దిపేట నుంచే రాజకీయ ప్రక్షాళన చేస్తానని, సిద్దిపేటలో రాజకీయ పాగా వేస్తానని టీఆరీఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(TRS President Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ విస్తరణలో భాగంగా శుక్రవారం సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలో నిర్మించనున్న జిల్లా పార్టీ కార్యాలయానికి ఆమె భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేట తన పుట్టినిల్లని, ఉద్యమాల అని పేర్కొన్నారు.
ఇక్కడి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతామని, సామాజిక తెలంగాణ సాధనే తమ లక్ష్యమని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం ఏడాది పాటు ప్రజల సమస్యలను అధ్యయనం చేశామని, ఐదు ప్రధాన అంశాలతో పాంచజన్య కార్యాచరణను రూపొందించామని తెలిపారు. సిద్దిపేట ప్రజలు తమ పార్టీకి ఆదరణ ఇవ్వాలని కోరారు. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టుల నిర్మాణం, నిధుల వినియోగంపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.
భూకంప ముప్పు నేపథ్యంలో మల్లన్నసాగర్ నిర్మాణానికి ముందు కెమికల్ ట్రీట్మెంట్ చేయాలని సాంకేతిక నివేదిక సూచించినా పట్టించుకోలేదని, ప్రస్తుతం ప్రాజెక్టులో లీకేజీలు వస్తున్నాయని ఆరోపించారు. రూ.93 వేల కోట్లు ఖర్చు చేసినా సాగునీరు కేవలం లక్ష ఎకరాలకే అందుతోందని విమర్శించారు. అప్పటి సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టు నిర్మాణం, బండ్ లీకేజీలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదని, రంగనాయకసాగర్ పరిధిలో భూముల కొనుగోళ్ల వ్యవహారంపైనా విచారణ అవసరమని అన్నారు. కొండపోచమ్మసాగర్ పొంగిపొర్లిన సమయంలో వెంకటాపూర్ గ్రామం ఎదుర్కొన్న పరిస్థితులు, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్ నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేస్తానని వెల్లడించారు. సిద్దిపేటలోని వెంకటేశ్వరాలయ భూముల వ్యవహారంలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపైనా విచారణ చేపట్టాలని కోరారు.
బొగ్గు అక్రమ రవాణా వ్యవహారంలోనూ అవకతవకలు జరిగాయంటూ ఆరోపించిన కవిత, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెయ్యి పడకల ఆసుపత్రిలో పూర్తిస్థాయి సదుపాయాలు లేకుండానే ప్రారంభించారని విమర్శించారు. గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా హరీశ్‌రావు ఉన్న సమయంలో నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నిధుల బదిలీ వ్యవహారంపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఒకప్పుడు 120 రైస్ మిల్లులతో కళకళలాడిన సిద్దిపేట ప్రాంతంలో ప్రస్తుతం 20 మిల్లులు కూడా లేవని, కార్పొరేట్ వ్యాపారాల విస్తరణతో స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని అన్నారు.
సంప్రదాయ వృత్తిదారులైన అవుసలి వర్గానికి ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నుంచే తెలంగాణ రక్షణ సేన రాజకీయ బలాన్ని చాటుతుందని కవిత ప్రకటించారు. ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా హరీశ్‌రావుపై తాము చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని కోరారు. స్పందన లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట నుంచే రాజకీయ ప్రక్షాళనకు శ్రీకారం చుడతామని ప్రకటించారు.