సర్పంచ్ పదవికి రూ.1.20 కోట్లు!

13-11-2026 | 11:00am

గ్రామంలో వింత నిర్ణయం.. సర్పంచి పదవికి బహిరంగ వేలం!

గొల్లప్రోలు: గ్రామ పంచాయతీ ఎన్నికలకు(AP Sarpanch Post Auction) ముందే ఓ సర్పంచి పదవి కోట్ల రూపాయల ధర పలకడం ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh Sarpanch Post) చర్చనీయాంశంగా మారింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో సర్పంచి స్థానానికి సంబంధించి నిర్వహించిన బహిరంగ వేలంలో ఓ వ్యక్తి ఏకంగా రూ.1.20 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

శివాలయంలో బహిరంగ వేలం

దుర్గాడ గ్రామంలోని శివాలయంలో బుధవారం రాత్రి కొందరు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. సర్పంచి పదవికి సంబంధించి బహిరంగ వేలం నిర్వహించగా ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. చివరకు ఓ వ్యక్తి రూ.1.20 కోట్లకు వేలంలో ముందంజలో నిలిచినట్లు సమాచారం. ఈ మొత్తం గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి వినియోగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

వార్డు సభ్యుల స్థానాలపైనా నిర్ణయం!

దుర్గాడ గ్రామ సర్పంచి స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో ఈ వేలం ప్రక్రియలో ఆ అంశం కూడా కీలకంగా మారింది. వేలంలో నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని, వార్డు సభ్యుల స్థానాలను కూడా ఏకగ్రీవం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ ఎన్నికలు జరిగితే తమకు మద్దతున్న అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కమిటీ బాధ్యులు తీర్మానించినట్లు తెలుస్తోంది.

గతంలోనూ రెండుసార్లు వేలం!

దుర్గాడ గ్రామంలో సర్పంచి పదవికి వేలం నిర్వహించడం ఇదే తొలిసారి కాదని స్థానిక సమాచారం. గతంలోనూ రెండుసార్లు ఇలాంటి ప్రక్రియ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, గ్రామ పెద్దలు నిర్వహించిన వేలం నిర్ణయం అధికారిక ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించదు. సర్పంచి ఎంపిక ఎన్నికల చట్టాలు, ఎన్నికల అధికారుల పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.1.20 కోట్ల వేలం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా, స్థానికంగా చర్చకు దారితీసింది.

మరిన్ని వార్తలు