స్మశానవాటికలో సబ్‌స్టేషన్!
- అంతిమ సంస్కారాల వేళ అవస్థలు
- ఉప్పరపల్లిలో వైకుంఠధామం ఉనికికే ముప్పు..
- అధికారుల నిర్ణయంపై గ్రామస్థుల ఆవేదన
కేసముద్రం, నవంబర్ 13 (విజయక్రాంతి): మనిషి జీవిత ప్రయాణానికి చిట్టచి వరి మజిలీ స్మశాన వాటిక. కులమతాలు, ఆర్థిక అంతరాలు, హోదాలు అన్నీ పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ అంతిమంగా చేరుకునే పవిత్ర స్థలం అది. అలాంటి వైకుంఠధామం నిర్వహణకు అవసరమైన స్థలాన్నే ఇతర అవసరాలకు కేటాయిస్తే అంతిమ సంస్కారాలు నిర్వహించేదెలా? అన్న ప్రశ్న ఉత్ప న్నమవుతోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామం(Uparapalli Village)లో ఇదే తరహా పరిస్థితి నెలకొంది.
గత ప్రభుత్వం గ్రామస్థుల అవసరాల కోసం నిర్మించిన వైకుంఠధామంలో తాజాగా విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతం తన అసలు ఉద్దేశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో ప్రజల చివరి మజిలీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైకుంఠధామంలో కొంత భాగాన్ని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు కేటాయించారు. దీంతో ఇప్పటికే ఉన్న వైకుంఠధామంలో సగానికి పైగా స్థలం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు, బంధుమిత్రులు హాజరయ్యేందుకు, ఇతర సంప్రదాయ కార్యక్ర మా లు జరిపేందుకు ఉపయోగపడాల్సిన స్థలం తగ్గిపోయిందని చెబుతున్నారు.
అంతిమ సంస్కారాలకు స్థలమేది?
వైకుంఠధామం అంటే కేవలం నాలుగు గోడలు, ఓ ఖాళీ ప్రదేశం కాదు. గ్రామ ప్రజలందరికీ అవసరమైన సామాజిక మౌలిక సదుపాయం. ఒక కుటుంబంలో విషాదం సంభవించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేలా తగిన స్థలం అందుబాటులో ఉం డాలి. కానీ ఉప్పరపల్లిలో సబ్‌స్టేషన్ ఏర్పాటు కారణంగా వైకుంఠధామం విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో అంత్యక్రియల నిర్వ హణకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు ప్రజా అవసరమే అయినప్పటికీ, అందుకోసం గ్రామ ప్రజల చివరి మజిలీకి కేటాయించిన స్థలాన్నే ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విద్యుత్ అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యమో, ప్రజల సామాజిక అవసరాలను కాపాడటం కూడా అంతే ముఖ్యం. అభివృద్ధి పేరుతో ఒక మౌలిక వసతిని ఏర్పాటు చేస్తూ మరో కీలకమైన ప్రజా సౌకర్యాన్ని నిర్వీర్యం చేయడం సమంజసం కాదని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.
నూతన వైకుంఠధామం ఏర్పాటు చేయాలి
సబ్ స్టేషన్ నిర్మాణంతో ప్రస్తుతం ఉన్న వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఇబ్బందిగా మారింది. దీనికి తోడు అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తే మంటలు చెలరేగి పక్కనే ఉన్న సబ్ స్టేషన్ కు ప్రమాదం పొంచి ఉంది. నూతనంగా గ్రామానికి దగ్గరలో వైకుంఠధామం నిర్మాణానికిప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించి, నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి చివరి మజిలీకి ఇబ్బందులు లేకుండా చూడాలి.
ఏర్పుల సునీత, సర్పంచ్,
ఉప్పరపల్లి