తీన్మార్ మల్లన్న పాదయాత్రలో ప్రమాదం
- మల్లన్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
- అదుపు తప్పి మరో కారును ఢీకొన్న మల్లన్న కారు
- మల్లన్నకు తప్పిన ప్రమాదం.. మరో కారులోని దంపతులకు తీవ్ర గాయాలు
- యాదాద్రి జిల్లా అనాజిపురం వద్ద ఘటన
- ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారీ
- తీన్మార్ మల్లన్నను హతమార్చే కుట్ర?
- టీఆర్పీ నేతల అనుమానాలు
- పార్టీ నేతలతో కలిసి డీజీపీకి ఫిర్యాదు చేసిన తీన్మార్ మల్లన్న
యాదాద్రి భువనగిరి, నవంబర్ 13 (విజయక్రాంతి): టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చేపట్టిన బీసీ రాజ్యాధికార పాదయాత్రలో పెను కలకలం రేగింది. శుక్రవారం 51వ రోజు పాదయాత్ర సాగుతున్న వేళ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం వద్ద తీన్మార్ మల్లన్న కాన్వాయ్ పైకి లారీ దూసుకొచ్చింది. మల్లన్న ఉపయోగించే కారును అది వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.
ఎదురుగా ఉన్న కారులో ఉన్న తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్, ఆయన భార్య చందన తీవ్రంగా గాయపడ్డారు. వారిని నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కారు డ్రైవర్ సురేశ్‌తో పాటు మల్లన్న కారులో ఉన్న బన్నీ, రంగన్న కూడా గాయపడ్డారు. అయితే పాదయాత్ర బృందానికి, మల్లన్న కారుకు మధ్యలో బస్సు వెళ్లిన కొద్దిసేపటికే లారీ వెనుక నుంచి ఢీకొట్టినట్లు యాత్ర వర్గాలు చెపుతున్నాయి.
ప్రమాదానికి ముందు లారీ డ్రైవర్ బ్రేకులు వేయలేదని, ఢీకొట్టిన వెంటనే మరో ఫార్చునర్ వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇది సాధారణ రోడ్డు ప్రమాదమా? లేక మల్లన్నను లక్ష్యంగా చేసుకున్న కుట్రనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లన్నను లక్ష్యంగా చేసుకునే లారీతో కారును ఢీకొట్టించారని టీఆర్పీ నాయకత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. బీసీ రాజ్యాధికార ఉద్యమాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని టీఆర్పీ నేతలు తెలిపారు.
డీజీపీకి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
ప్రమాదం జరిగిన పరిస్థితులు అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయని, దర్యాప్తు జరిపి నిజానిజాలు తేల్చాలని కోరుతూ తీన్మార్ మల్లన్న.. డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తన వ్యక్తిగత భద్రతతో పాటు, బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తనతో కలిసి పాల్గొంటున్న వ్యక్తుల భద్రతపై తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తోందని తెలిపారు. తన రాజకీయ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్న కొందరు వ్యక్తులు, వెనుకబడిన తరగతుల రాజకీయ సాధికారత కోసం తాను చేస్తున్న పోరాటాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రమాదాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించి ఉండవచ్చని బలంగా అనుమానిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటనను పథకం ప్రకారం నిర్వహించి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని కోరారు. ఈ ఘటన తీవ్రతను, తన ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని తక్షణమే తగిన సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు. డీఎస్పీ స్థాయి అధికారిని దర్యాప్తు బాధ్యతలకు నియమించాలని తీన్మార్ మల్లన్న డీజీపీని కోరారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు.