స్కేరీ పిక్చర్‌తో హారర్ ప్రయోగం
టాలీవుడ్ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి(Rana Daggubati) సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ చిత్రం ‘స్కేరీ పిక్చర్’ ఫస్ట్ లుక్‌ను రానా శుక్రవారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా “ఓ కొత్త భయానక అనుభవం మొదలుకాబోతోంది” అంటూ రానా తన పోస్టులో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని డీ సురేశ్‌బాబు నిర్మిస్తుండగా, రవిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మాణ సంస్థలపై ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన చిత్రాలతో పరిచయమైన రవిబాబు ఈ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. గతంలో ఆయన తెరకెక్కించిన ‘అనసూయ’, ‘అవును’ వంటి హారర్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మరోవైపు, హారర్ జానర్‌లో మరిన్ని సినిమాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రానా దగ్గుబాటి ముందుకు సాగుతున్నారు. సైకలాజికల్ హారర్, క్రియేచర్ హారర్, హారర్ కామెడీ, సోషల్ హారర్ వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు చేయాలనుకునే దర్శకులు, రచయితలకు నిర్మాణ సహకారం అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. “భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన భయాలు, కథలు, కథన శైలులు ఉన్నాయని, హారర్ జానర్‌లో ప్రతిభావంతులైన దర్శకులకు అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం” అని తెలిపారు. ‘స్కేరీ పిక్చర్’ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీని చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు.