ఇబ్రహీంపట్నంలో ‘ఫోర్జరీ’ కలకలం!
- రూ. 50 కోట్ల ప్రభుత్వ భూమి పక్కదారి
- మంగళపల్లి సర్వే నం. 96లోని 4.25 ఎకరాలు పట్టాగా మార్పిడి
- తహసీల్దార్ డిజిటల్ ‘కీ’ దుర్వినియోగమా?
- దానికి ఇంటి దొంగల పనేనా
- నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై సర్వత్రా వెల్లువెత్తుతున్న అనుమానాలు
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 2 (విజయ క్రాంతి): రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) ఇబ్రహీంపట్నం రెవెన్యూ(Ibrahimpatnam Revenue) పరిధిలో మరో రూ. 50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి మాయాజాలం వెలుగుచూసింది. మంగళ్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 96లో ఉన్న 4.25 ఎకరాల విస్తీర్ణంగల ప్రభుత్వ భూమిని రాత్రికి రాత్రే ప్రైవేటు వ్యక్తుల పేరిట పట్టాగా మార్చేసి, ఏకంగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ(Issuance of Pattadar Passbooks) చేయడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
తాజాగా ఈ వ్యవహారంపై ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతా రెడ్డి(Ibrahimpatnam Tahsildar Sunitha Reddy) స్పందిస్తూ తన ప్రమేయం లేకుండానే తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని, దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అయితే, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ రికార్డుల్లో డిజిటల్ సంతకం ద్వారా పాస్ పుస్తకాలు జారీ కావడం వెనుక కేవలం ‘ఫోర్జరీ‘ మాటలతో అధికారులు చేతులు దులుపుకోవాలని చూస్తున్నారా? లేక కార్యాలయ సిబ్బంది, ఉన్నతాధికారుల కుమ్మక్కే దీనికి కారణమా? అన్న దిశగా స్థానికుల్లో తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సామాన్యుడికి దక్కని న్యాయం... బడా బాబులకు హస్తగతం! : తాసీల్దార్ సునీత రెడ్డి
సామాన్య ప్రజలు కుల, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోని అధికారులు, రూ. 50 కోట్ల భూమి విషయంలో మాత్రం ఇంత సులువుగా ‘ఫోర్జరీ జరిగిపోయింది‘ అని చెప్పడం ఏంటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గతంలో 2024-25 కాలంలోనూ 22(A) నిషేధిత జాబితాలో ఉన్న భూములు సైతం అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి.కార్యాలయంలో డిజిటల్ కీ ఎవరి ఆధీనంలో ఉంది? అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో ఉన్నతాధికారులు నిష్పాక్షికంగా సమగ్ర విచారణ జరిపి, ఈ రూ. 50 కోట్ల భూ దోపిడీకి కారణమైన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.