CJP దెబ్బకు ఢిల్లీ షేక్!

02-10-2026 | 12:41pm

న్యూఢిల్లీ/ముంబై: దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబై వరకు నిరసనల వాతావరణం నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CJP Gyanesh Kumar) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ  (CJP) ఆందోళనలకు పిలుపునిచ్చింది. అక్టోబర్ 2న ముంబైలోని శివాజీ పార్క్‌ నుంచి ‘జైల్ భరో ఆందోళన్’ చేపడతామని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. ఈ ఉద్యమాన్ని ఇతర నగరాలకు విస్తరించే ప్రణాళికను కూడా ఆయన వెల్లడించారు.

ఢిల్లీలో హైఅలర్ట్.. జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు

ఇదే సమయంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నిరసనల ప్రభావంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాలతో 11 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్‌లపై ఆంక్షలు విధించినట్లు తాజా నివేదికలు తెలిపాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

ఇంటర్నెట్ సేవలపైనా ప్రభావం

జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను(Delhi Internet Shutdown) నిలిపివేసినట్లు పలువురు వినియోగదారులు పేర్కొన్నారని నివేదికలు వెల్లడించాయి. తమ ప్రాంతంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్నెట్ సేవలు తదుపరి ఆదేశాల వరకు నిలిపివేసినట్లు సందేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో నిరసనల మధ్య ఢిల్లీలో కమ్యూనికేషన్ వ్యవస్థపై కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపించింది.

శివాజీ పార్క్ చుట్టూ భారీ పోలీసు బందోబస్తు

ముంబైలో CJP ఆందోళన నేపథ్యంలో శివాజీ పార్క్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు తాజా సమాచారం. ఆ ప్రాంతాన్ని నో-పార్కింగ్ జోన్‌గా ప్రకటించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు స్థానికంగా కొందరు నివాసితులు నిరసనకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. గతంలో ముంబై పోలీసులు శివాజీ పార్క్‌లో CJPకి నిరసనకు అనుమతి నిరాకరించినప్పటికీ, దీప్కే ‘జైల్ భరో ఆందోళన్’ కొనసాగిస్తామని ప్రకటించారు.

దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపు

CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో CJP దేశంలోని పలు నగరాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై CJP ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు ఎన్నికల కమిషన్ మాత్రం ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియపై తన వైఖరిని వెల్లడించింది. ఈ నేపథ్యంలో CJP నిరసనలు దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భద్రతా ఆంక్షలు, ముంబైలో శివాజీ పార్క్ వద్ద నిరసనల నేపథ్యంలో పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. తాజా పరిణామాలు, నిరసనల ప్రభావం, ట్రాఫిక్ ఆంక్షలు, మెట్రో మార్పులపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు వెలువడుతున్నాయి.

మరిన్ని వార్తలు