తహసీల్దార్ సహా 13 మందిపై కేసు!
భూమి రికార్డుల తారుమారు.. 13 మందిపై కేసు!
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం పరిధిలో వెలుగులోకి వచ్చిన భూ వివాదం వ్యవహారం పోలీసు కేసుకు దారితీసింది. యాచారం మండలం నందివనపర్తిలోని సర్వే నంబర్లు 361/ఏఏ, 361/ఏ, 361కు సంబంధించిన భూముల విషయంలో నకిలీ పత్రాలు సృష్టించడం, రికార్డుల్లో మార్పులు చేయడం, మోసానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుపై 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం.. భూమిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో నకిలీ జాయింట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఇతర పత్రాలు రూపొందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 26 నకిలీ పత్రాల ఆధారంగా భూమి విస్తీర్ణాన్ని రికార్డుల్లో పెంచినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ పత్రాలను ఆధారంగా చేసుకుని సివిల్ కోర్టులో కేసు వేసి, కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. అనంతరం ఎక్స్‌పార్టీ డిక్రీ, తీర్పు పొందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ధరణి, భూభారతి రికార్డులపైనా ఆరోపణలు
ధరణి, భూభారతి డిజిటల్ రికార్డుల్లో వివరాలను తారుమారు చేశారని, ఇందుకు యాచారం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సహకరించారని ఫిర్యాదుదారు ఆరోపించారు. 2017 నాటి పార్టిషన్ డాక్యుమెంట్ నంబర్‌ను కూడా మార్చినట్లు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో మాజీ డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, తహసీల్దార్ అయ్యప్ప, డిప్యూటీ తహసీల్దార్ కీర్తి సాగర్, భూభారతి ఆపరేటర్ నర్సింహాచారి సహా 13 మందిపై కేసు నమోదైంది. కేసులోని ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.