పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్‌ 6 చివరి తేదీ

24-10-2026 | 09:44pm

- ఫారం–18 ద్వారా ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అవకాశం

- అర్హులైన పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలి

- చేవెళ్ళ ఆర్డీఓ పార్థసింహారెడ్డి

చేవెళ్ల, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Election) ఓటు హక్కు(Right to vote) వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో(Voter List) నమోదు చేసుకోవాలని చేవెళ్ల రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కె. పార్థసింహారెడ్డి(Parthasimha Reddy) కోరారు. పట్టభద్రుల ఓటరు నమోదుకు 2026 నవంబర్ 6 చివరి తేదీ అని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఫారం–18 ద్వారా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మూడేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

31 అక్టోబర్ 2023 నాటికి కనీసం మూడేళ్ల క్రితం డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణులైన పట్టభద్రులు, ఇతర అర్హత నిబంధనలకు లోబడి ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుతో పాటు అవసరమైన విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించి ఫారం–18 సమర్పించాలని సూచించారు.

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత మున్సిపల్ లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాల వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. అర్హులైన పట్టభద్రులందరూ గడువులోగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకుని, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్డీఓ పార్థసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు