అంబేద్కర్ సమాజ మార్పు కోసం ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి
ఘట్ కేసర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(Dr. B.R. Ambedkar) సమాజ మార్పు కోసం ఎంతో కృషి చేసిన ఎంతో గొప్ప వ్యక్తి అని కాచవాని సింగారం మాజీ ఉపసర్పంచ్ కర్రె అశోక్(Karre Ashok) అన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 286వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘట్కేసర్ పట్టణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్రె అశోక్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం మార్పుచెందాలని ప్రపంచ దేశాలు తిరిగి పెద్ద పెద్ద చదువులు చదివి నేను అనుభవించిన బాధలు ప్రజలు అనుభవించకూడదని సమాజ మార్పు కోసం ఎంతో కృషి చేసి జ్ఞానం వైపు నడిపిన గొప్ప నేత అంబేద్కర్ అని కొనియాడారు. ఇలా ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు కడపోల్ల భిక్షపతి, నాయకులు బండారి రాందాస్, కట్కూరి నర్సింగరావు, కె. సత్యం బి. రిషి గౌడ్, మధు, ఆర్. అరుణ్ తేజ్, పి. మధు, పి. మహేందర్ రెడ్డి, కడప రవి, ఈ. విష్ణు, డి. శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.