ఎన్నికలకు దూరంగా?..ఇందుకే?
వచ్చే ఎన్నికల్లో (Next Elections) తాను పోటీ చేస్తానో లేదో తెలియదని.. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదని ఎంఐఎం (AIMIM) శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్‌లో విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో ఆయన తన రాజకీయ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడారు. విద్యార్థులతో మాట్లాడిన అక్బరుద్దీన్ ఒవైసీ.. “నేను ముసలోడిని అయిపోయాను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు.. చేయను” అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ (Comments) ప్రస్తుతం హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అయితే ఇది ఆయన ప్రస్తుత వ్యాఖ్య మాత్రమేనని.. ఎన్నికల సమయానికి ఆయన తుది నిర్ణయం (Final Decision) ఏమిటన్నది భవిష్యత్తులో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం పోటీపై ఆసక్తి లేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. తన విద్యాభ్యాసం, రాజకీయ ప్రస్థానం గురించి కూడా అక్బరుద్దీన్ ఆసక్తికర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. తాను 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని చెప్పారు. అయితే విద్యాభ్యాసం పరిమితమైనప్పటికీ ప్రజా జీవితంలో (Public Life) కీలక స్థాయికి ఎదిగిన విషయాన్ని ప్రస్తావించారు.