విద్యుత్ కోతలతో ఎండుతున్న సాగర్ ఆయకట్టు
* 24 గంటలు కాదు.. కనీసం 16 గంటలైనా కరెంట్ ఇవ్వాలి
* పొట్ట దశలో ఉన్న వరి పంటలను కాపాడాలని సీపీఐ నేత పోకల వెంకటేశ్వర్లు డిమాండ్
గరిడేపల్లి, అక్టోబర్ 4 (విజయ క్రాంతి) : విద్యుత్ కోతలతో(Power cuts) సాగర్ ఆయకట్టు పరిధిలో వరి పంటలు ఎండిపోతున్నాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు(CPI District Executive Committee Member Pokala Venkateswarlu) ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్(Free electricity) ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 8, 9 గంటల కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని విమర్శించారు. గరిడేపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన సీపీఐ మండల సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. తరచూ సరఫరా నిలిచిపోవడంతో పొలాల్లోని మడులకు నీరు సరిగా అందడం లేదని తెలిపారు. ముఖ్యంగా వరి పంట పొట్ట దశలో ఉన్నందున ఈ సమయంలో నీరు అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. ప్రభుత్వం తక్షణమే విద్యుత్ కోతలను నివారించి, పంటలు చేతికొచ్చే వరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి త్రిపురం సుధాకర్‌రెడ్డి, సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి, చెవ్వ వెంకన్న, వెంకటరెడ్డి, పోకల ఆంజనేయులు, తిరగమళ్ల కిరణ్, కట్టా అశోక్, పంగ గోవిందు, ప్రధాని సైదులు తదితరులు పాల్గొన్నారు.