పరిగి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతా

04-10-2026 | 08:49pm

బీజేపీ నాయకుడు వెన్న ఈశ్వరప్ప

పల్లవి గార్డెన్స్‌లో ఘనంగా జన్మదిన వేడుకలు.. భారీ బైక్‌ ర్యాలీ

గండీడ్, అక్టోబర్ 04 (విజయక్రాంతి): ప్రజా సేవే తన జీవిత లక్ష్యమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిగి నియోజకవర్గం(Parigi Constituency) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బీజేపీ రాష్ట్ర నాయకుడు, వెన్నచేడ్‌ గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరప్ప తెలిపారు.

ఆదివారం ఆయన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని 50 మందికి పైగా రక్తదాన శిబిరం నిర్వహించి దేశాయిపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. 2 వందల బైకులతో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. గండీడ్‌ మండలంలోని వెన్నచేడ్‌ గ్రామంలో అంబేద్కర్‌, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు ఈశ్వరప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దేశాయిపల్లి(నంచర్ల)గేట్‌ చౌరస్తాకు చేరుకున్న ఈశ్వరప్పకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.అక్కడి నుంచి పల్లవి గార్డెన్స్‌ వరకు బైక్‌ ర్యాలీ కొనసాగింది. పల్లవి గార్డెన్స్‌లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈశ్వరప్పకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, దళితులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు.

బీజేపీ అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరుకునే పార్టీ అని, దళితుల అభివృద్ధికి పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం, బీజేపీ కార్యకర్తల బలం తనకు అండగా ఉంటే వచ్చే ఎన్నికల్లో పరిగి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని తెలిపారు. ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్ధితో పాటు పేదలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

-విద్యార్థికి చేయూత..

మహమ్మదాబాద్‌ మండల కేంద్రానికి చెందిన ఎంబీబీఎస్‌ సీటు సాధించిన విద్యార్థిని గాయత్రికి ఈశ్వరప్ప పుస్తకాలను అందజేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని, పేద కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు