సింగీతం శ్రీనివాసరావు అస్తమయం
సినీ లోకానికి మరో షాక్..
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు(Singeetam Srinivasa Rao) కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో(Kaveri Hospital) చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సింగీతం శ్రీనివాసరావు పేరు చెప్పగానే ‘పుష్పక విమానం’,(Pushpak Vimanam) ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’ వంటి విభిన్నమైన చిత్రాలు గుర్తొస్తాయి. సాధారణ కథలకు భిన్నంగా కొత్త ఆలోచనలను తెరపై ఆవిష్కరించిన దర్శకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1972లో ‘నీతి నిజాయితీ’ సినిమాతో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన సింగీతం.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో సుమారు 60 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న కథలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. వయసు 90 దాటినా సినిమాపై ఆసక్తిని కొనసాగించారు. చివరిగా ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమా అంటే కేవలం వినోదం కాదని, ప్రయోగాలకు కూడా వేదిక కావచ్చని తన చిత్రాల ద్వారా నిరూపించిన సింగీతం శ్రీనివాసరావు మరణం తెలుగు సినిమాకు తీరని లోటుగా మిగిలిపోనుంది.