త్వరలో నీ ఫామ్‌హౌస్ ముట్టడిస్తాం
శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
మంథని లో విలేకరుల సమావేశంలో పుట్ట మధు కు కాంగ్రెస్ పార్టీ నాయకుల హెచ్చరిక
మంథని, సెప్టెంబర్ 27(విజయక్రాంతి) : రాష్ట్ర మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై(Duddilla Sridhar Babu) మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు(Former MLA Putta Madhu) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పుట్ట మధును(Putta Madhu) ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు(Inappropriate comments) చేస్తే సహించేది లేదని, త్వరలో నీ ఫామ్‌హౌస్‌ను(farmhouse) ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
పుట్ట మధు ఇకనైనా అసత్య ప్రచారాలను మానుకోవాలని మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, విద్యుత్ బోర్డు సభ్యుడు శశిభూషణ్ కాచే, మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమాదేవి, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, మాజీ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్ తదితరులు మాట్లాడుతూ.. గత పదేళ్లలో పుట్ట మధు వ్యవహారశైలిని ప్రజలు గమనించారని, వెంకటాపూర్ పరిధిలో భూముల ఎలా వచ్చాయని పుట్ట మధు ను ప్రశ్నించారు.
రచ్చపల్లి గ్రామస్తులు పునరావాస ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బులతో వెంకటాపూర్‌లో భూములు కొనుగోలు చేసుకున్న సందర్భంలో వారిని బెదిరించి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఆరోపించారు. శ్రీధర్‌బాబు భూములపై పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. శ్రీధర్‌బాబు ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ, విద్యా సామగ్రి అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను అమలు చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై కూడా తమ ప్రభుత్వం స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటోందన్నారు. దళితులకు భూముల పంపిణీపై కూడా కాంగ్రెస్ నాయకులు పుట్ట మధును ప్రశ్నించారు. తమ ప్రభుత్వం, దుద్దిళ్ల శ్రీపాదరావు, శ్రీధర్‌బాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన వారికి భూముల పట్టాలు అందించినట్లు పేర్కొంటూ, బీఆర్‌ఎస్ హయాంలో ఎంతమందికి భూములు పంపిణీ చేశారో వెల్లడించాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ సవాల్ చేశారు.
మహనీయుల జయంతి, వర్ధంతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ వారి ఆశయాల సాధనకు కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. ఇకపై శ్రీధర్‌బాబు, శ్రీనుబాబుపై వ్యక్తిగత ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.