కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం
ఘన నివాళులర్పించిన మంథని కాంగ్రెస్ నాయకులు
మంథని, సెప్టెంబర్ 27(విజయ క్రాంతి): తెలంగాణ తొలి తరం ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని మంథని మండల కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu), టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు(Duddilla Srinu Babu) ఆదేశాల మేరకు ఆదివారం మంథని మంత్రి క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అయిలి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. పదవుల కంటే ప్రజాసేవకే ప్రాధాన్యతనిచ్చిన గొప్ప త్యాగశీలి అని కొనియాడారు. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని, బాపూజీ ఆశయాలను మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.