జగిత్యాలను చూసొద్దాం!
పర్యాటకానికి ప్రోత్సాహం అవసరం
గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక ప్రజలకు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. స్థానికంగా తయారయ్యే ఆహార పదార్థాలు, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ లభించవచ్చు. స్థానిక యువతకు టూరిస్ట్ గైడ్లు, హోమ్స్టేలు, రవాణా, ఆతిథ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. కోటిలింగాల, వాల్గొండ, ధర్మపురి తదితర గోదావరి పరివాహక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ పర్యావరణహిత పర్యాటక మార్గాలను అభివృద్ధి చేయవచ్చు. అయితే నదీ పర్యాటక అభివృద్ధి పేరుతో గోదావరి నదిని, నదీ పరిసరాలను కలుషితం చేయకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాలు మధురానుభూతులను మిగిల్చడంతో పాటు , రోజు వారి జీవన ప్రయాణంలో ఒత్తిడిని తగ్గిస్తూ , మన పరిజ్ఞానాన్ని విస్తరింపజేస్తాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం (World Tourism Day)సందర్భంగా తెలంగాణ పర్యాటక వైభవాన్ని గుర్తుచేసుకోవాలి. తెలంగాణలో చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలున్న జగిత్యాల జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కొండలు, నదులు, దేవాలయాలు, కోటలు, పురాతన కట్టడాలు, పచ్చని పంట పొలాలు, గ్రామీణ వాతావరణం పర్యాటకులను ఆకట్టుకునే విశేష సంపదగా నిలుస్తున్నాయి.
ఆధ్యాత్మిక కేంద్రం కొండగట్టు
జగిత్యాల పర్యాటకానికి మణిహారంగా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిసరాల్లోని కొండగట్టు ఆంజనేయస్వామి తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. కొండల మధ్య ప్రకృతి ఒడిలో వెలసిన ఈ క్షేత్రానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఆలయ పరిసరాల్లోని కొండలు, పచ్చని చెట్లు, వర్షాకాలంలో కనిపించే ప్రకృతి సోయగాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పర్యాటకుల రాక పెరుగుతున్న నేపథ్యంలో కొండగట్టు పరిసరాల్లో పరిశుభ్రత, పచ్చదనం, ప్లాస్టిక్ నియంత్రణ, వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ధర్మపురి, జగిత్యాల కోట, కోటిలింగాల చరిత్ర
గోదావరి నది తీరంలో వెలసిన ధర్మపురి.. జగిత్యాల జిల్లాలో మరో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ దర్శనంతో పాటు గోదావరి నదీ తీరంలోని ప్రకృతి అందాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. జగిత్యాల పట్టణంలోని చారిత్రక కోట జిల్లాకు గర్వకారణమైన వారసత్వ కట్టడాల్లో ఒకటి. నక్షత్రాకార నిర్మాణ శైలి, కోట చుట్టూ ఉన్న చారిత్రక నేపథ్యం పర్యాటకులను ఆకర్షించే అంశాలు.
జగిత్యాల కోట వంటి వారసత్వ కట్టడాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. జగిత్యాల జిల్లా చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో కోటిలింగాల ఒకటి. గోదావరి, పెద్దవాగు సంగమ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రాచీన చరిత్రలో విశిష్ట స్థానం ఉంది. ధర్మపురికి సుమారు 19 కిలోమీటర్లు, కరీంనగర్‌కు సుమారు 55 కిలోమీటర్లు, హైదరాబాద్‌కు సుమారు 218 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాల ప్రస్తుతం గ్రామీణ వాతావరణంలో ఉన్నప్పటికీ, గతంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన చారిత్రక ప్రాంతంగా వెలుగొందింది.
శాతవాహనుల కాలానికి సంబంధించిన నాణేలు, పురావస్తు అవశేషాలు ఈ ప్రాంత ప్రాచీనతను చాటుతున్నాయి. శాతవాహనుల తొలి రాజధానిగా కోటిలింగాలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. పురావస్తు తవ్వకాలలో లభించిన నాణేలు, మట్టి పాత్రలు, ఇతర అవశేషాలు అప్పటి నాగరికత, వాణిజ్య కార్యకలాపాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాలు, గోదావరి బ్యాక్వాటర్ ప్రాంతం పర్యాటక అభివృద్ధికి అవకాశాలను కల్పిస్తున్నాయి. కోటిలింగాలను చరిత్ర, పురావస్తు, ఆధ్యాత్మికత, ప్రకృతి పర్యాటకాలను కలిపిన ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది.
గోదావరి తీరాన త్రికూటాలయం
జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గోదావరి నదీ తీరాన ఉన్న మరో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశం. గోదావరి తీరంలోని గుట్టపై ఉన్న త్రికూటాలయం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. చాళుక్యుల కళా రీతులను ప్రతిబింబించే నిర్మాణ శైలి ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యాన్ని కల్పిస్తోంది. రాయికల్ ప్రాంతంలోని త్రికూటాలయ నిర్మాణ శైలిని పోలిన శిల్పకళా లక్షణాలు ఇక్కడ కనిపిస్తాయి.