అందాల విల్లా నల్లమల!

27-09-2026 | 05:25am

నాగర్‌కర్నూల్, (విజయక్రాంతి):ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిళ్ల నుంచి కాసేపు ఉపశమనం పొందేందుకు ప్రకృతి ఒడిలో సేదతీరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వారికి నల్లమల అడవులు(Nallamala Forests) ప్రకృతి అందాల విందును అందిస్తున్నాయి. పచ్చని ఎత్తున కొండలు, సెలయేళ్ల సవ్వడి, పక్షుల కిలకిల రాగాలు, వన్యప్రాణుల సంచారంతో నల్లమల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

శ్రీశైలం, ఉమామహేశ్వరం, మల్లెలతీర్ధం, సలేశ్వరం, సంగమేశ్వరం, సోమశిల, లొద్ది మల్లయ్య వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు అమరగిరి, మల్లయ్య సెల, అంకాలమ్మ కోట, చీమలతిప్ప వంటి ప్రకృతి ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

కృష్ణమ్మ ఒడ్డున మల్లయ్య సెల

నల్లమల అడవుల మధ్య కృష్ణానది ఒడ్డున ప్రకృతి అందాలకు నిలువెత్తు రూపంగా నిలుస్తోంది అమరగిరి మల్లయ్య సెల. కొల్లాపూర్ నుంచి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. కృష్ణమ్మ పరవళ్లు, కొండలు, గుట్టల నుంచి జాలువారే స్వచ్ఛమైన నీటితో నిత్యం కళకళలాడే సెలయేరు ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. మల్లయ్య సెలలో ఏడాది పొడవునా నీరు ఉంటుందని స్థానికులు చెపుతున్నారు.

వేసవి కాలంలోనూ కొండల్లోని ఊటల నుంచి నీరు ఉబికి వస్తుందని, ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయన్నది స్థానికుల విశ్వాసం. చుట్టూ పచ్చని కొండలు.. మధ్యలో స్వచ్ఛమైన జలధార.. ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది.

రుషుల తపో భూమి!

పూర్వం ఇక్కడ రుషులు తపస్సు చేశారని, అందుకే ఈ ప్రాంతానికి అమరగిరి అనే పేరు వచ్చిందని స్థానికంగా ప్రచారం ఉంది. ఆలయం సమీపంలోని ఎలుక చెట్టు ఆకులు ప్రత్యేకమైన తియ్యటి రుచిని కలిగి ఉంటాయని స్థానికులు చెపుతారు. దీంతో ఈ ప్రాంతానికి ప్రకృతి అందాలతో పాటు ఆధ్యాత్మిక ప్రత్యేకత కూడా చేకూరింది. పట్టణాల రణగొణ ధ్వనికి, సెల్‌ఫోన్ సిగ్నల్‌కు దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునేవారికి అమరగిరి మంచి గమ్యస్థానంగా నిలుస్తోంది.

కుటుంబ సభ్యులు, యువత, ప్రకృతి ప్రేమికులు ఇక్కడి కొండలు, అడవులు, సెలయేళ్ల అందాలను ఆస్వాదించవచ్చు. మల్లయ్య సెలతో పాటు సమీపంలోని అంకాలమ్మ కోట, చీమలతిప్ప (ఐలాండ్) ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. కృష్ణానది, నల్లమల అడవులు, కొండలు, సెలయేళ్లతో కూడిన ఈ ప్రాంతాన్ని సమగ్ర పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే స్థానిక పర్యాటక రంగానికి మరింత ఊతం లభించే అవకాశం కనిపిస్తోంది. 

 మల్లయ్య


మరిన్ని వార్తలు