పుష్కర భక్తులకు పూర్తి భద్రత కల్పించాలి
గత ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలి
మంథనిలో గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల(Godavari Pushkaralu)ను దృష్టిలో పెట్టుకుని మంథని గోదావరి తీరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) బుధవారం పరిశీలించారు. గోదావరి నది తీరంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్లతో పాటు గౌతమేశ్వర స్వామి ఆలయ(Gautameshwara Swamy Temple) అభివృద్ధి పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే గోదావరి పుష్కరాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
గతంలో గోదావరి నదిలో చోటుచేసుకున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని.. అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కర స్నానాలకు వచ్చే ఏ ఒక్క భక్తుడికీ ప్రాణహాని కలగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సురక్షితమైన స్నానపు ప్రాంతాలతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా ఘాట్ల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.
అదేవిధంగా గౌతమేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలు ప్రారంభమయ్యేలోపు అన్ని పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సయేందర్ రెడ్డి, కమిషనర్ మనోహర్, కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరావు గుప్తా, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ హరిప్రసాద్, డీఈ రమేష్, ఏఈఈలు ప్రవీణ్, నిఖిల్, కాంట్రాక్టర్ కుంభం శ్రీరామ్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొండ శంకర్, నాయకులు శశిభూషణ్ కాచే, ఉప్పట్ల శ్రీను, సెగ్గం రాజేష్, మూల పురుషోత్తం రెడ్డి, మంథని సత్యం, పేరవేన లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.