భారీ వర్ష సూచన.. 18 జిల్లాలకు అలర్ట్
చెన్నై: తమిళనాడులో వర్షాలు(Rains) దంచికొట్టనున్నాయి. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం(Chennai Meteorological Centre) హెచ్చరించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నామక్కల్, కరూర్, తిరుచిరాపల్లి, తంజావూరు, తిరువారూర్, మయిలాదుతురై, నాగపట్నం, పుదుక్కోట్టై, శివగంగ, రామనాథపురం, దిండిగల్, మధురై, విరుదునగర్, తేని, తెన్కాశి, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది.
మరోవైపు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కోయంబత్తూరు, సేలం, వెల్లూరు సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పుదుచ్చేరిలోనూ అక్కడక్కడ వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజధాని చెన్నైలో బుధవారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.