ఢిల్లీ అల్లర్ల కేసు.. నేడు విచారణ

25-11-2026 | 09:12am

న్యూఢిల్లీ: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసు(Northeast Delhi Riots Case 2020)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థి కార్యకర్తలు ఉమర్ ఖాలిద్(Student activist Umar Khalid), షర్జీల్ ఇమామ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court) బుధవారం విచారణ చేపట్టనుంది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వీరిద్దరూ వేర్వేరుగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. సెప్టెంబర్ 30న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వీరు పిటిషన్లు దాఖలు చేశారు. అంతకుముందు జూలై 4న ట్రయల్ కోర్టు(Trial Court) సైతం వీరి సాధారణ బెయిల్ దరఖాస్తులను తిరస్కరించింది.

గతంలో జనవరి 5న సుప్రీంకోర్టు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరించింది. అయితే కీలక ప్రాసిక్యూషన్ సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత లేదా ఆ ఉత్తర్వు వెలువడిన ఏడాది తర్వాత.. ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పుడు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. తాజాగా విచారణలో జాప్యం, సుదీర్ఘకాలంగా జైలులో ఉండటం, ఇతర నిందితులకు లభించిన బెయిల్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ వీరు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అయితే గతంలో సుప్రీంకోర్టు విధించిన షరతులను పక్కనపెట్టి బెయిల్ మంజూరు చేయలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలతో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లపై UAPA చట్టం కింద కేసు నమోదైంది. వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు