హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలి
టెర్రర్ అటాక్ మెయిల్ లీకేజీపై విచారణ జరపాలి
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): కేటీఆర్(KTR) ప్రపంచ దేశాల నుంచి కంపెనీలు తెస్తే.. యూత్ కాంగ్రెస్ నాయకులేమో(Youth Congress leaders) కంపెనీలపై దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(R S Praveen Kumar) పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి హోం మంత్రిగా(Home Minister) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎన్నడూ లేనంత హింస జరుగుతున్నదన్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) వచ్చాక తెలంగాణలో పోలీసు శాఖ(Police Department) పతనమైందని విమర్శించారు.
టెర్రర్ అటాక్స్ ఇన్ హైదరాబాద్ పేరిట నవంబర్ 21న లేఖ వచ్చిందని, లష్కరే తోయిబా నాయకుడు లతీఫ్ భట్‌ను ఇండియన్ ఆర్మీ చంపినందుకు బదులుగా ఈ దాడులకు పాల్పడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారన్నారు. సీఐ, ఏసీపీ, డీసీపీల వద్ద ఉండాల్సిన మెసేజ్ ... సామాజిక మాధ్యమాల్లో వచ్చిందన్నారు. తర్వాత పుకార్లు నమ్మొద్దని పోలీసు అధికారులు చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ముంబై తరహా దాడులు జరుగుతాయని మెయిల్ వస్తే... అంతర్గతంగా వెరిఫై చేయకుండా ఎందుకు ఆ లేఖ బయటకు వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, సీనియర్ నాయకులు మంద శ్యాం, కొంకటి శేఖర్, శ్రీనివాస్ యాదవ్, అబ్రార్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.