వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కొత్త పేరు

25-11-2026 | 08:23am

వరంగల్: వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరు ఖరారు చేసింది. ఇకపై ఈ ఆస్పత్రి ‘మహాత్మాగాంధీ మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి’ (Mahatma Gandhi Memorial Super Speciality Hospital)గా గుర్తింపు పొందనుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ జీవో విడుదల చేసింది.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చొంగ్తు నవంబర్ 23న జీవో ఎంఎస్ నంబర్ 180 జారీ చేశారు. ఆస్పత్రి నిర్మాణం, ఏర్పాటుకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త పేరుకు అనుగుణంగా అవసరమైన పరిపాలనా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఉత్తర తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రికి కొత్త పేరు ఖరారు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు