ముత్తారంలో స్వీడన్ దేశ ప్రతినిధుల పర్యటన

27-11-2026 | 08:52pm
  1. రీజనరేటివ్ వ్యవసాయంపై ఐకియా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ బృందం ఆసక్తి
  2. రైతుల సాగు విధానాలు, సమస్యలపై ప్రత్యేకంగా ఆరా

ముత్తారం, నవంబర్ 27(విజయ క్రాంతి) పర్యావరణ పరిరక్షణతో(Environmental Protection) పాటు భూసారాన్ని పెంపొందిస్తూ లాభదాయకమైన వ్యవసాయం చేసే లక్ష్యంతో చేపడుతున్న రీజనరేటివ్ వ్యవసాయ విధానాలపై స్వీడన్ దేశ ప్రతినిధుల బృందం ఆసక్తి కనబరిచింది. నవక్రాంతి ఎఫ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో అమలవుతున్న ల్యాండ్‌మార్క్ రీజనరేటివ్ అగ్రికల్చర్ ప్రాజెక్టులో భాగంగా శుక్రవారం ముత్తారం మండల కేంద్రంలోని రైతు వ్యవసాయ క్షేత్రాన్ని విదేశీ ప్రతినిధుల బృందం సందర్శించింది.

ఐసీఎస్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ బోట్ల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో స్వీడన్‌కు చెందిన ఐకియా ప్రతినిధి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాగు చేస్తున్న పత్తి పంటను పరిశీలించి, అంతర పంటల సాగు, పంట మార్పిడి విధానాలు, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై వివరాలు తెలుసుకున్నారు.

రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి

రీజనరేటివ్ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ విధానాన్ని మరింత విస్తరించేందుకు అవసరమైన సహకారంపై ప్రతినిధులు ఆరా తీశారు. సేంద్రీయ ఎరువుల లభ్యత, విత్తనాల ఖర్చు, మార్కెటింగ్ ఇబ్బందులు, వాతావరణ మార్పుల ప్రభావం, ప్రభుత్వ సహకారం తదితర అంశాలపై రైతులతో చర్చించారు. ముఖ్యంగా వైటెక్స్ తయారీ విధానం, దాని ఉపయోగాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు.

అనంతరం దర్యాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వీడన్ ప్రతినిధుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థిని కూచిపూడి నృత్యంతో అతిథులకు స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం రైతు పెగడ రాజు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ఆయన అనుసరిస్తున్న పశుపోషణ విధానాలు, పశుసంపద అభివృద్ధి, వ్యవసాయంతో పశుపోషణ అనుసంధానం, వర్మీ కంపోస్ట్ తయారీ, వర్మీ వాష్ వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు.

నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న రైతుల కృషిని స్వీడన్ ప్రతినిధులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం, కేశనపల్లి గ్రామ సర్పంచ్ పెగడ తిరుమల కుమార్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. రాజశేఖర్, మేనేజర్లు బత్తిని శ్రీనివాస్, టి. సతీష్ కుమార్, పి. సింధు, నిఖిత, క్షేత్రస్థాయి అధికారులు కె. మధుకర్, ఎస్. రాజశేఖర్, ఎన్. రాజశేఖర్, ఎస్. రాజు, జి. అజయ్, మోడల్ స్కూల్ విద్యార్థులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు