విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారుల వైఖరి మారాలి
లేకుంటే మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం: ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల
మహా ముత్తారం నవంబర్ 6 (విజయక్రాంతి): మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు సక్రమంగా అందించడంలో క్షేత్రస్థాయి అధికారుల పాత్ర ఎంతో కీలకమని, అయితే కొన్ని శాఖల అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం సరికాదని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల(AMC Chairperson P Tirumala) అన్నారు.
అధికారులు తమ పనితీరును మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆమె సూచించారు. లేనిపక్షంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు జిల్లా కలెక్టర్కు సంబంధిత అధికారులపై ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు మహా ముత్తారం మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారుల నివేదికలను సమీక్షించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యంగా మండల సమావేశాలకు స్పెషల్ ఆఫీసర్, ఇంజనీరింగ్, ఎక్సైజ్, అటవీశాఖ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు హాజరుకాకపోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించాల్సిన కీలక సమావేశాలకు అధికారులు గైర్హాజరు కావడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజాప్రతినిధులు తమ గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలనే ఉద్దేశంతో సమావేశాలకు వస్తుంటే అధికారులు హాజరుకాకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు రోజుకు దాదాపు 20 గంటలు కష్టపడుతూ మంథని నియోజకవర్గంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని, ఆయన పనితీరును, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను అధికారులు స్ఫూర్తిగా తీసుకోవాలని పంతకాని తిరుమల సూచించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాలంటే ప్రతి శాఖ అధికారి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మంజూరైన మహిళా భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనుల్లో కూడా వేగం పెంచాలని సూచించారు. ప్రభుత్వ నిధులు మంజూరైన తర్వాత పనులు ఆలస్యం కాకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.
ఇకపై నిర్వహించే మండల జనరల్ బాడీ సమావేశాలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలకు అధికారులు సమాధానాలు చెప్పడంతో పాటు వాటి పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఈ సమావేశంలో కాటారం డివిజన్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొండగొర్ల బాపు, మండల సర్పంచులు, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు పాల్గొని తమ శాఖలకు సంబంధించిన నివేదికలను సమర్పించి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.