చోలా ఫైనాన్స్ అధిక వడ్డీలు, అక్రమ వాహన స్వాధీనంపై చర్యలు తీసుకోవాలి

26-10-2026 | 05:34pm

జిల్లా కలెక్టర్‌కు UTUC వినతిపత్రం

బోధన్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ చోలా ఫైనాన్స్ అధిక వడ్డీరేట్లు వసూలు చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను స్వాధీనం చేసుకుంటోందని ఆరోపిస్తూ, ఆ సంస్థపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(United Trade Union Congress) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా UTUC జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ.. చోలా ఫైనాన్స్ సంస్థ అధిక వడ్డీరేట్లు వసూలు చేస్తూ పేద, మధ్యతరగతి వినియోగదారులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రుణ వాయిదాల చెల్లింపులో స్వల్ప జాప్యం జరిగినా, వినియోగదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

సంస్థ సిబ్బంది మాట్లాడుకుందామని పిలిచి, మూడు నెలల ఈఎంఐ బకాయిల వ్యవహారం పూర్తికాకముందే ఆటోను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అనంతరం రూ.2,000 సీజింగ్ ఛార్జీలు వసూలు చేయడంతో పాటు, కేవలం రెండు గంటల వ్యవధికే పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యల వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వాహన రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలు, ఎన్‌బీఎఫ్‌సీలకు వర్తించే నిబంధనలు, రుణ ఒప్పందాలకు సంబంధించిన చట్టపరమైన సూత్రాలను పాటించాలని రాములు సూచించారు. రుణ వాయిదాల చెల్లింపులో సమస్యలు ఎదురైనప్పుడు బాధితులతో చర్చించి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఫైనాన్స్ సంస్థలపై ఉందన్నారు. ముందస్తు సమాచారం, నిబంధనలకు అనుగుణమైన ప్రక్రియ లేకుండా వాహనాలను స్వాధీనం చేసుకోవడం వల్ల పేద కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొన్నారు.

ఆటోలు, ఇతర వాహనాల ద్వారా జీవనోపాధి పొందుతున్న పేద డ్రైవర్లు, చిన్న వ్యాపారులపై ఫైనాన్స్ సంస్థలు అనవసర ఒత్తిడి తీసుకురాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. చోలా ఫైనాన్స్ సంస్థ వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టి, అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల ఆరోపణలపై పరిశీలన జరపాలని, బాధిత వినియోగదారులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను UTUC జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో UTUC నాయకులు గోపాల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు