అన్నదాతల గోడు పట్టించుకోకపోతే ఉద్యమం తప్పదు
సాలూరలో బీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక
సాలూర, నవంబర్06(విజయక్రాంతి): ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు(Anti-farmer policies), తీవ్ర కరువు పరిస్థితుల వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో సాలూర మండల(Salur Mandal) కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఇల్తేపు గంగారాం మాట్లాడుతూ... ప్రభుత్వం ఆరుతడి పంటలు వేయాలని చెప్తున్నప్పటికీ, సాగుకు సరిపడా ఎన్ని గంటల ఉచిత విద్యుత్ అందిస్తుందనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.
విద్యుత్ ఆదా చేయాలనుకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలు, ఫ్రిజ్లు బంద్ చేసుకోవాలి తప్ప, పగలు రాత్రి కష్టపడే అన్నదాతల కరెంట్ పై ఆంక్షలు విధించడం సరికాదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రైతులకు వేళకు నాణ్యమైన కరెంట్ ఇచ్చి ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే చిన్న, సన్నకారు రైతులు పండించిన ధాన్యం కోసి ఆరబోసుకుంటుంటే, దళారులు మాత్రం లారీ నిండా సరుకు ఉంటేనే కొంటామని షరతులు పెడుతూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్భాటంగా ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు, గన్నీ సంచుల కొరతపై స్పందిస్తూ వెంటనే ధాన్యాన్ని సేకరించి రైతులకు రావాల్సిన బోనస్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో నవంబర్ నాటికే ఖాతాల్లో పడే రైతు భరోసా నిధులు నేటికీ జమ కాకపోవడం ప్రభుత్వ ఘోర వైఫల్యమేనని విమర్శించారు.
కష్టకాలంలో ఉన్న రైతులకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆరుతడి పంటలకు కావలసిన విత్తనాలను సబ్సిడీపై అందించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు చందూర్ సాయిరెడ్డి, ల్మ దత్తు, ముస్త్యాల దత్తు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.