శరణుఘోషతో మార్మోగిన కడ్తాల్ శ్రీ ధర్మశాస్తా ఆలయం
నిర్మల్ నవంబర్ 23 ( విజయక్రాంతి): స్వామియే శరణం అయ్యప్ప(Lord Ayyappa is my refuge) నామస్మరణతో సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీధర్మశాస్తా అయ్యప్ప ఆలయం(Sri Dharmashasta Ayyappa Temple) సోమవారం మార్మోగింది. అయ్యప్ప దీక్ష స్వీకరించేందుకు భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు. సమీపంలోని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలధారణ చేశారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో హరిహరపుత్రుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన నియమ నిబంధనలు, ఆచరించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్వాములకు వివరించారు. ఈ సందర్భంగా తానూరు మండలం బోసి గ్రామానికి చెందిన 56 మంది భక్తులు అయ్యప్ప మాలధారణ చేసి దీక్ష స్వీకరించారు. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గురుస్వామి తెలిపారు.