నల్లబెల్లిని కరువు మండలంగా ప్రకటించాలి

23-11-2026 | 08:12pm
  1. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నాయకుల డిమాండ్
  2. వరికి రూ.20 వేలు, పత్తికి రూ.30 వేలు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి

నల్లబెల్లి, నవంబర్ 23 ( విజయ క్రాంతి): నల్లబెల్లి మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి, ఆర్థికంగా చితికిపోయిన రైతులు, వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు(Leaders of public associations) డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో సీపీఐ మండల కార్యదర్శి పరికి కోర్నేలు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం (Round table meeting) నిర్వహించారు.

ముఖ్య డిమాండ్లు ఇవే

సాగు చేయని వరి రైతులకు ఎకరాకు రూ.20 వేలు, పత్తి రైతులకు రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి కోరారు. రూ.2 లక్షల రుణమాఫీ వర్తించని రైతులకు వెంటనే మాఫీ చేయాలన్నారు. ఉపాధి కూలీలకు 200 పని దినాలు కల్పించి, రోజుకు రూ.700 కూలీ ఇవ్వాలని, చౌక దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసరాలు, ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం అందించాలన్నారు. ఉపాధి హామీ నిధుల విషయంలో కేంద్రం పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

మూడేళ్లుగా కాళేశ్వరం మరమ్మతులను నిర్లక్ష్యం చేయడంతో భూగర్భ జలాలు అడుగంటాయని రైతు సంఘం నాయకులు మామిళ్ల మోహన్ రెడ్డి విమర్శించారు. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ ఉచితంగా రిపేర్లు చేయాల్సి ఉండగా, ప్రజాధనం రూ.4,200 కోట్లు కేటాయించడాన్ని తప్పుబట్టారు. ముందే దేవాదుల నీటిని విడుదల చేసి ఉంటే పంటలు ఎండిపోయేవి కావన్నారు. కరువు జాబితాలో మండలం లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఎం మండల కార్యదర్శి కరియాల మనోహర్ అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని కరువు మండలంగా ప్రకటింపజేయాలని కోరారు. కూలీలకు ఏటా రూ.12 వేలు, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలని మహిళా సంఘం నాయకురాలు కత్తి రమ డిమాండ్ చేశారు. చెరువుల్లో నీళ్లు లేక పశుపక్షాదులు దాహార్తితో అల్లాడుతున్నాయని, మత్స్య సంపద లేక వందలాది ముదిరాజ్ కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయని రైతు సంఘం, వివిధ పార్టీల నాయకులు మామిళ్ల పెద్ద ఐలయ్య, కడియాల క్రాంతి కుమార్, ఆవాల సంపత్ రావు, బొడిగ సమ్మయ్య, వైనాల జంపయ్య, భూస రామ్మూర్తి, పండుగ మహేందర్, అల్లే నరసింహ రాములు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు