విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ జరపాలి

24-11-2026 | 07:40pm

నిర్మల్ నవంబర్ 24 ( విజయ క్రాంతి): బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి(Basara IIIT student) చల్ల సంపత్ ఆత్మహత్య అత్యంత బాధాకరం అని దీనిపైసమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ డిమాండ్ చేశారు.

ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చల్ల సంపత్ హాస్టల్ గదిలో ఆత్మహత్య తీసుకోవడానికి అక్కడి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.  ముందుగా సంపత్ కుటుంబానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.

బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు చదువుల విపరీతమైన ఒత్తిడి, మరోవైపు యువతను పెడదోవ పట్టిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు విద్యార్థుల విలువైన ప్రాణాలను బలితీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

క్యాంపస్‌లో విద్యార్థుల మానసిక స్థితిని, సమస్యలను ఎప్పటికప్పుడు గమనించి పరిష్కరించే సరైన వ్యవస్థ లేకపోవడం యూనివర్సిటీ అధికారుల, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన క్యాంపస్‌లు, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల విషాద నిలయాలుగా మారుతున్నాయని అన్నారు.

ప్రభుత్వాన్ని అలాగే యూనివర్సిటీ వీసీ గారిని ఏబీవీపీ పక్షాన సూటిగా డిమాండ్ చేస్తున్నాము:

సమగ్ర విచారణ: చల్ల సంపత్ మృతిపై తక్షణమే ఉన్నత స్థాయి సమగ్ర విచారణ జరిపించి, ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

బెట్టింగ్ యాప్‌ల నిషేధం: యువత భవిష్యత్తును నాశనం చేస్తూ ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్‌లను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించాలి.

కౌన్సెలింగ్ కేంద్రాలు: ప్రతి హాస్టల్‌లో పూర్తి స్థాయి మానసిక నిపుణులతో (సైకాలజిస్టులతో) కూడిన కౌన్సెలింగ్ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి, విద్యార్థులకు నిరంతరం భరోసా కల్పించాలి.

మరిన్ని వార్తలు