భక్తులతో కిటకిటలాడిన హరి హర క్షేత్రాలు
ముకరంపుర, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి(Kartika Purnima)ని పురస్కరించుకొని నగరంలోని హరి హర క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. మంగళవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని పలు దేవాలయాల్లో భక్తులు ముఖ్యంగా మహిళలు కమాన్ చౌరస్తాలో గల రామలింగేశ్వర దేవాలయం, భగత్ నగర్ లోని భవాని శంకర ఆలయం, అయ్యప్ప దేవాలయంలోని హరి హర క్షేత్రం, పాత బజార్ లోని శివాలయం, జ్యోతి నగర్ లో గల మహాశక్తి ఆలయం నందు తులసి దామోదర కళ్యాణం, ఉసిరిక దీప దానాలు, ధాన్య దానాలు, ఊష్మాండ దానాలు భక్తులు ఆచరించి ఆధ్యాత్మిక తన్మయం పొందారు.
ఒకవైపు అయ్యప్ప మాల దీక్షా పరులు, మరోవైపు మహిళా భక్తుల చేత హరి హర నామంతో దేవాలయాలు మారుమోగాయి. కార్తీక పౌర్ణమి శివకేశవుల ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున శివారాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ పర్వదినం ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, దానధర్మాలు, సత్యనిష్ఠకు ప్రతీకగా నిలుస్తుంది. ఉపవాసాలు, జపాలు, ధ్యానం, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు.