7 September, 2026 | 12:50 PM

సీఎంఆర్ చింత!

07-09-2026 | 05:45am
  1. రైస్ మిల్లర్లకు రబీ సీజన్ గండం  
  2. క్వింటాకు 67 కిలోలు ప్రభుత్వ లక్ష్యం
  3. 50 కిలోల వస్తాయంటున్న మిల్లర్లు 
  4. ఆందోళనకు సిద్ధమవుతున్న ఓనర్లు
  5. (బండి సంపత్‌కుమార్)

మహబూబాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): రైస్ మిల్లర్లకు సీఎంఆర్ చింత పట్టుకుంది. రబీ సీజన్(Rabi Season) ధాన్యంలో బియ్యం లెక్కలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. క్వింటా వడ్లకు సివిల్ సప్లయీస్ శాఖ(Civil Supplies Department)కు అప్పగించాల్సిన నిర్దేశిత బియ్యం లక్ష్యం రైస్ మిల్ యజమానులకు గుదిబండగా మారింది.

ప్రభుత్వం నిర్దేశించిన మేరకు బియ్యం రావడం లేదని మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు. క్వింటాల్‌కు 67 కిలోల ముడి బియ్యం (రా రైస్) ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ, 45 కిలోలు మాత్రమే బియ్యం వస్తున్నట్లు మిల్లర్లు పేర్కొంటున్నారు. కాగితాలపై లెక్కలు ఒకలా.. మిల్లుల్లో వాస్తవాలు మరోలా ఉండటంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.  

ఖరీఫ్‌కు రబీకి చాలా తేడా?

వాస్తవానికి రబీ పంట ధాన్యం నాణ్యత ఖరీఫ్ పంట కంటే చాలా వ్యత్యాసం ఉం టుందని మిల్లర్లు చెబుతున్నారు. పంట కోత, వాతావరణ పరిస్థితులు, ధాన్యం నిల్వ, తేమ, రవాణా వంటి అంశాలు గింజ నాణ్యతపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమని పేర్కొంటున్నారు. రబీలో సేకరించిన ధాన్యం మిల్లులకు చేరి.. వాటిని మిల్లుకు వేస్తేగానీ.. వాస్తవం ఏమిటనేది తెలుస్తుందంటున్నారు.

నాణ్యతలో తేడా ఉంటే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చేరుకోవడం సాధ్యం కాదంటున్నారు. ‘ధాన్యం ఎంత ఉందన్నది కాదు.. దాని నుం చి ఎంత నాణ్యమైన బియ్యం వస్తుందన్నదే అసలు ప్రశ్న’ అని పలువురు రైస్ మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. మిల్లింగ్ సమయంలో ధాన్యం నుంచి, ఊక తొలగిపోవ డం, తేమ తగ్గడం, విరిగిన బియ్యం పెరగడం, నూక శాతం అధికం కావడం, తరుగు, ఇతర వ్యర్థాలు.. మొత్తంగా బియ్యం రికవరీ తగ్గుతుందని మిల్లర్లు వాపోతున్నారు. 

‘67 కిలోల లెక్క’.. మిల్లర్లకు తీరని లోటు!

ఒక్కో క్వింటా ధాన్యానికి 67 కిలోల బియ్యం సీఎంఆర్ లక్ష్యం కాగా, కొన్ని సందర్భాల్లో 45 నుంచి 50 కిలోల వరకే అను వైన బియ్యం లభిస్తోందని మిల్లర్లు చెబుతున్నారు. ఈ లెక్కన 15 నుంచి 20 కిలోల వరకు రికవరీ వ్యత్యాసం వస్తే, వేలాది క్విం టాళ్ల ధాన్యం మిల్లింగ్ చేస్తే పెద్దమొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.  ఇలా ఒక్కో ఏ సీ కే (290 క్వింటాళ్ల రా రైస్) కు సుమారు లక్ష రూపాయల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద మొత్తంలో ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లిం గ్ చేసినప్పుడు, ప్రతి క్వింటాల్‌కు వచ్చే లోటు మొత్తం కలిపితే వందల టన్నులకు చేరుతుందని వాపోతున్నారు. ప్రభుత్వానికి నిర్దేశిత పరిమాణంలో బియ్యం ఇవ్వాలంటే, మార్కెట్ నుంచి అదనం గా బియ్యం కొనుగోలు చేసి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడు తోందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రమక్రమంగా పెరుగుతూ, వారి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.

నాణ్యతను బట్టి లక్ష్యం నిర్దేశించాలి

ప్రతి గింజ ఒకే రకమైన నాణ్యత కలిగి ఉండదని, దీంతో అన్ని సీజన్లలో ఒకే స్థాయిలో బియ్యం రికవరీ వస్తుందని భావించడం ఆచరణ సాధ్యంకాదని మిల్లర్లు చెప్తున్నారు. ధాన్యం రకం, సీజన్, తేమ, నాణ్యత ఆధారంగా సీఎంఆర్ లక్ష్యం నిర్దేశించాలని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు.   

అధికారుల తనిఖీలతో పరేషాన్! 

ఒకవైపు నిర్ణీత పరిమాణంలో బియ్యం అప్పగించాలనే నిబంధన, మరోవైపు సీఎంఆర్ ధాన్యం నిల్వలు, మిల్లింగ్ పురోగతి, బియ్యం నిల్వలపై అధికారుల తనిఖీల మధ్య రైస్ మిల్లర్లు ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వ ధాన్యం లెక్కలకు, మిల్లింగ్ ద్వారా వాస్తవంగా వచ్చే బియ్యం పరిమాణానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరి శీలించాలని మిల్లర్లు కోరుతున్నారు.

కేవలం రికార్డుల్లోని లెక్కలను ఆధారంగా చేసుకోకుండా, మిల్లింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి వాస్తవ రికవరీ ఎంత వస్తుందో నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నారు. శాశ్వ త పరిష్కారం కోసం ప్రభుత్వం శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలని రా రైస్ మిల్లర్లు కోరుతున్నారు. ప్రతి సీజనుకు ఒకే రకమైన రికవరీ నిర్ణయించకుండా  ప్రమాణాలను పాటించాలని సూచిస్తున్నారు. 

ప్రభుత్వం స్పందించాలి.. 

సీఎంఆర్ అనేది ప్రభుత్వ ప్రణాళికలో భాగం. ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన బియ్యాన్ని అందించడంలో రైస్ మిల్లర్ల పాత్ర అత్యంత ముఖ్యమైనది. అయితే, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా నిర్దేశిత లక్ష్యాలను అమలు చేస్తే, మిల్లర్లపై ఆర్థిక భారం పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

రబీ ధాన్యం మిల్లింగ్లో 67 కిలోల లక్ష్యం సాధ్యం కాకపోతే, అసలు రికవరీ ఎంత? లోటుకు బాధ్యత ఎవరిది? అదనపు బియ్యాన్ని మిల్లర్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి? అనే ప్రశ్నలు ఇప్పుడు రైస్ మిల్లర్లలో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రభు త్వం, సివిల్ సప్లై అధికారులు, మిల్లర్ల సంఘాలు సంయుక్తంగా సమావేశమై క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించి సీఎంఆర్ రికవరీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆందోళన దిశగా మిల్లర్లు

సీఎంఆర్ వాస్తవ పరిస్థితిని గమనించాలని, దాడులతో తమను ఇబ్బందులు పెట్టవద్దని, నిజాయితీగా ఏండ్ల తరబడి మిల్లులు నడుపుతున్న రైస్ మిల్లర్లను , ఉద్దేశపూర్వకంగా అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లను ఒకే గాటిన కట్టకూడదని మిల్లర్లు కోరుతున్నారు. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత సీఎంఆర్ నిర్ణయించాలని, రైతు మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లతో రైస్ మిల్లర్లు ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు.


మరిన్ని వార్తలు