కాంపౌండరే దిక్కు..?

07-09-2026 | 05:35am
  1. గణపురం పశువైద్యశాలను పట్టించుకోని అధికారులు 
  2. ఇంచార్జ్ వైద్యుడితో రైతులకు ఇబ్బందులు 
  3. అవస్థలు పడుతున్న ఆసుపత్రి పరిధి రైతులు

గణపురం, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): గణపురం పశువైద్యశాల(Ganapuram Veterinary Hospital)కు కాంపౌండరే దిక్కయ్యాడు. ఇంచార్జ్ వైద్యుడితో రైతులు  తమ పశువులకు సకాలంలో వైద్యం అందించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే వైద్యుడు బదిలీపై వెళ్లడంతో, చెల్పూర్ పశువైద్యశాల డాక్టర్ కు ఇన్చార్జి అప్పగించారు.

దీంతో ఇంచార్జ్ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో గణపురం పశు వైద్యశాల పరిస్థితి దయనీయంగా మారిందనే ఫిర్యాదులు వస్తున్నాయి. కాంపౌండర్తోనే తాత్కాలిక  చికిత్సలు అందిస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోవడంతో పాటు మందుల కొరతతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అత్యవసర చికిత్సలు, గర్భధారణ పరీక్షలు, శస్త్రచికిత్సలు వంటి కీలక సేవలు అందుబాటులో లేక రైతులు ఏం చేయాలో పాలు పోనీ స్థితి ఏర్పడింది.

కొన్ని సందర్భాల్లో చికిత్సలు అందక పశువుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆసుపత్రిలో అవసరమైన మందులు లేకపోవడం చికిత్స కోసం వచ్చిన వారికి బయట నుంచి మందులు కొనుగోలు చేయాలని సూచించడం వల్ల రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని వాపోతున్నారు. గణపురం మండలంలో గొర్రెలు, మేకలు, పాడి పశువుల పెంపకం అధికంగా ఉండటంతో ప్రతి రోజు పెద్ద సంఖ్యలో రైతులు ఈ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారు. 

వైద్యుడు లేకపోవడం, మందుల కొరత సమస్యల కారణంగా సరైన సమయంలో చికిత్స అందక పశు పెంపకం దెబ్బతింటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడిన ఈ ప్రాంతానికి వెంటనే శాశ్వత పశువైద్యుడిని నియమించి, ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల మందులను సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని రైతులు, గొర్రెల పెంపకదారులు, జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

పశు వైద్యశాలకు వెంటనే డాక్టర్‌ను నియమించాలి

గణపురం మండల కేంద్రంలోని పశు వైద్య శాలకు వైద్యుడు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల రైతులు తమ పశువులు, గేదెలు, గొర్రెలు మేకలకు వ్యాధులు సోకిన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గణపురం పశు వైద్యశాలకు కాంపౌండర్ మాత్రమే ఉండడంతో పూర్తిస్థాయి వైద్య సేవలు అందడం లేదు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి గణపురం మండల కేంద్రంలోని పశు వైద్యశాలకు శాశ్వత వైద్యున్ని నియమించాలి.

మహేష్,

బీజేవైఎం నాయకుడు

మరిన్ని వార్తలు