7 September, 2026 | 12:51 PM

ఫాక్స్‌కాన్‌లో మంథని మారుమూల గ్రామాల యువతకు కొలువులు

07-09-2026 | 11:00am

ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని, సెప్టెంబరు 07(విజయ క్రాంతి): మంథని(Manthani) నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు చెందిన యువత ప్రముఖ బహుళజాతి సంస్థ ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu) అన్నారు. ముత్తారం, రామగిరి, కాటారం, పలిమెల, మహాదేవపూర్, మహముత్తారం, కమాన్‌పూర్, మంథని మండలాలకు చెందిన యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించగా, వారు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన యువతకు మంత్రి శ్రీధర్‌బాబు స్వయంగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. పేద కుటుంబాలకు చెందిన యువత, ఆడబిడ్డలు సైతం ఉద్యోగాలు సాధించడంతో వారి కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

గ్రామీణ ప్రాంతాల యువతకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే ఈ నియామకాలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన యువత మంత్రి శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

యువత కోసం టాస్క్ సెంటర్

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి, నూతన ఆలోచనలను ప్రోత్సహించే లక్ష్యంతో మంథనిలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘స్టార్ట్ డ్రీమ్ ఎరైజ్’ కార్యక్రమం ద్వారా యువతలో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తూ, వారికి అవసరమైన మార్గదర్శకత్వం, శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడం ద్వారా వారు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు వారి కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు