పులి దాడికి యత్నం.. ప్రాణభయంతో పరుగులు తీసిన కౌలు రైతు

21-09-2026 | 11:13pm

హన్వాడ,(విజయక్రాంతి): పులి(Tiger) ఒక్కసారిగా దాడికి యత్నించడంతో ఓ కౌలు రైతు(Tenant Farmers) ప్రాణభయంతో పరుగులు తీసిన ఘటన హన్వాడ మండలం(Hanwada Mandal)లో చోటుచేసుకుంది. రామన్నపల్లి గ్రామానికి చెందిన దుప్పటి గట్టు కృష్ణయ్య తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బాధితుడి కథనం మేరకు.. గొండ్లియల శివారు హత్యకుంట తండా స్మశానవాటిక సమీపంలోని పొలాన్ని కౌలుకు తీసుకున్న కృష్ణయ్య సోమవారం ట్రాక్టర్‌తో వ్యవసాయ(Agriculture) పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో సమీపంలోని ఎల్లగొండ సావు అటవీ ప్రాంతం వైపు నుంచి ఒక్కసారిగా పులి తనవైపు దూసుకొచ్చిందని తెలిపాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నాడు. 

ప్రాణభయంతో ట్రాక్టర్‌పై నుంచి దూకి బతుకుజీవుడా అంటూ తండా వైపు పరుగులు తీశానని కృష్ణయ్య తెలిపాడు. తాను కేకలు వేయడంతో వాటిని విన్న తండావాసులు సంఘటనా స్థలానికి చేరుకోగా,వారిని గమనించిన పులి అడవుల్లోకి పారిపోయిందని చెప్పాడు. పులిని ప్రత్యక్షంగా చూసిన భయంతో కృష్ణయ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడికి ప్రాథమిక చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లారు. పులి సంచారంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారని స్థానిక రైతులు తెలిపారు. అటవీ అధికారులు పులి కదలికలను గుర్తించి, రైతులకు రక్షణ కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు