4 September, 2026 | 1:00 PM

కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం ఆగదు

04-09-2026 | 12:13pm

5వ గని గేట్ మీటింగులో పాల్గొన్న గండ్ర 

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 04 ( విజయక్రాంతి ): సింగరేణి కార్మికుల(Singareni workers) హక్కుల హక్కుల సాధన కోసం తమ పోరాటం ఆగదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy) అన్నారు. సింగరేణి భూపాలపల్లి ఏరియా కేటీకె(Area KTK) 5వ గనిలో టీబీజికేఎస్(TBJKS) ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగులో గండ్రతో పాటు టీబిజికేఎస్(TBJKS) రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ముందుగా సెక్యూరిటీ సిబ్బంది గేట్లు వేసి గండ్రను అడ్డుకునే ప్రయత్నం చేయగా కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం గండ్ర గేట్ మీటింగులో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రశ్నించడానికి వచ్చిన తనను గేట్లు వేసి, సెక్యూరిటీ సిబ్బంది ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. తాము సంఘ విద్రోహ శక్తులం కాదని, ప్రజలు, కార్మికుల హక్కుల కోసం ప్రశ్నించే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తున్నామని అన్నారు. సింగరేణి కార్మికులకు కనీస అవసరాలైన షూస్, పనిముట్లు, మైనింగు(Mining)లో బొగ్గు ఉత్పత్తికి అవసరమైన డ్రిల్ బిట్స్, ఇతర సౌకర్యాలు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఎగుమతి చేసిన బొగ్గుకు సంబంధించిన బకాయిలను సకాలంలో చెల్లించకపోతే సింగరేణి సంస్థ ఆర్థికంగా ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొస్తే తప్ప కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి పరిరక్షణ(Preservation of Singareni)తో పాటు కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని అందులో భాగంగానే కార్మికులకు 1000 క్వార్టర్ల నిర్మాణం, రామప్ప కాలనీలో సుమారు వెయ్యి క్వార్టర్ల ఏర్పాటు, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల సమయంలో కార్మికులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. సుభాష్ కాలని, యాదవకాలని, క్రిష్ణకాలనీల(Krishnakalanila)లో సింగరేణి భూములల్లో ఇళ్లు నిర్మించుకున్న కార్మికులకు ఇండ్ల పట్టాల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జీఒ తీసుకొచ్చి, స్వంత ఇంటి హక్కు కల్పించామని తెలిపారు.

ఇది సంబరాలు చేసుకునే సమయం కాదు, ఆత్మపరిశీలన చేసుకునే సమయమని, ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకుని, బాధ్యతాయుత పాలన సాగించాలని హెచ్చరించారు.