లక్కీ డ్రాతో వైసీపీ అభ్యర్థికి విజయం!
శ్రీకాకుళం: ఎన్నికల ఫలితాల్లోనూ(Election Results) అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో వెలువడిన ఫలితం మరోసారి నిరూపించింది. 35వ వార్డులో టీడీపీ, వైసీపీ(YSRCP) అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో విజేతను నిర్ణయించేందుకు అధికారులు లక్కీ డ్రాను ఆశ్రయించారు. చివరకు అదృష్టం వైసీపీ అభ్యర్థి మార్పు అరుణ(YSRCP Candidate Marpu Aruna)ను వరించింది.
35వ వార్డు నుంచి టీడీపీ(TDP) తరఫున జోగ త్రివేణి, వైసీపీ తరఫున మార్పు అరుణ పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు(Counting of votes) పూర్తయ్యే సమయానికి ఇద్దరికీ చెరో 340 ఓట్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఫలితం తేల్చడం కోసం సాధారణ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ ప్రక్రియలో వైసీపీ అభ్యర్థి మార్పు అరుణ విజేతగా నిలిచారు. దీంతో 35వ వార్డు ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. లక్కీ డ్రాలో తమ అభ్యర్థికి విజయం దక్కడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు నిర్ణయమవుతుంటాయి. కానీ ఇక్కడ ఇద్దరికీ సమాన ఓట్లు రావడం, చివరకు లక్కీ డ్రాతో విజేతను ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.