వారసత్వ కట్టడాల పరిరక్షణలో వాలంటీర్లు కీలకం
జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు
వెంకటాపూర్, నవంబర్ 03 (విజయక్రాంతి): వారసత్వ సంపద విశిష్టతను ప్రపంచానికి చాటడంతో పాటు చారిత్రక కట్టడాల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా అదనపు కలెక్టర్ఎం. సంపత్ రావు(Additional Collector Sampath Rao) అన్నారు. మంగళవారం మండలంలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్–2026 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పర్యాటక శాఖ నోడల్ అధికారి ధర్మనాయక్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు, శ్రీధర్ రావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. చరిత్ర, పురావస్తు, వారసత్వ కట్టడాల సంరక్షణపై ఆసక్తితో శిక్షణ శిబిరానికి హాజరైన వాలంటీర్లను అభినందించారు. శిక్షణలో తెలుసుకున్న రామప్ప దేవాలయ చారిత్రక విశిష్టత, కాకతీయుల కళా వైభవం, వారసత్వ సంపద పరిరక్షణ అంశాలను మరింత మందికి వివరించాలని సూచించారు. యువత వారసత్వ కట్టడాల సంరక్షణలో చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం పర్యాటక శాఖ నోడల్ అధికారి ధర్మనాయక్ మాట్లాడుతూ.. ఇలాంటి శిక్షణ శిబిరాలు యువతకు కెరీర్‌పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వివిధ ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, జీవనశైలిని తెలుసుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు మంచి అవకాశాన్ని కల్పిస్తాయని, శిబిరంలో నేర్చుకున్న అంశాలను ఇతరులకు తెలియజేస్తూ కాకతీయుల కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు వాలంటీర్లు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ చల్లగొండ రాజు, పర్యాటక శాఖ గైడ్లు విజయ్, వెంకటేష్, రాష్ట్ర పురావస్తు శాఖ ఫోర్మన్ బాబు, టూరిస్ట్ పోలీసులు అరుణ్, భద్రు, వివిధ శాఖల సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.