టిబెట్‌లో భారీ విధ్వంసం

24-10-2026 | 05:10am
  1. బీభత్సం సృష్టించిన 7.0 తీవ్రత భూకంపం
  2. గంటల వ్యవధిలోనే 400 సార్లు కంపించిన భూమి
  3. 65 మంది మృతి, 76మందికి గాయాలు
  4. 11 మంది పరిస్థితి విషమం.. కూలిన 339 ఇళ్లు
  5. ఉపగ్రహాలు, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు

బీజింగ్, అక్టోబర్ 23: టిబెట్‌(Tibet)లోని పర్వత ప్రాంతంలో గురువారం రాత్రి 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం(Earthquake) భారీ విధ్వంసం సృష్టించింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 400 సార్లు భూమి కంపించింది. ఈ విపత్తులో 65 మంది మృతిచెందారు. మరో 76 మంది గాయపడగా, వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 339 ఇళ్లు కూలిపోయాయి.

రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఊర్లన్నీ అంధకారంగా మారాయి. సహాయక చర్యల కోసం చైనా 5000 మందితోపాటు, ఉపగ్రహాలను, డ్రోన్లను మోహరించింది. ఈ మేరకు శుక్రవారం అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 10.33 గంటలకు 10 కిలోమీటర్ల కంటే తక్కువ లోతులో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లోని నాగ్చు నగరంలోని మారుమూల బాకెన్ కౌంటీలో భారీ విధ్వంసం, ప్రాణనష్టం జరిగింది.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రత నమోదు కాగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు 400 ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు ఇటు టిబెట్‌తోపాటు పాక్‌లె 4.9 తీవ్రతతో, అఫ్ఘానిస్థాన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించాయ న్నారు. నాగ్చు నగరం బాచెన్ కౌంటిలో వచ్చిన భూకంపం ధాటికి 65 మంది(శుక్రవారం అర్ధరాత్రి వరకు) మృతిచెందారు. 339 ఇళ్లు కూలిపోయాయి. 20 పశువుల కొట్టాలు దెబ్బతిన్నాయి.

భూకంపం ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటికి వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భూకంపం ధాటికి ప్రజలంతా రాత్రంతా చలిలో రోడ్లపైనే గడిపారు. ఇప్పటివరకు 12,489 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారని, బాధితుల పునరావాసంతో పాటు సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని ప్రాంతీయ రాజధాని లాసా నుంచి ప్రభుత్వ ఆధీనంలోని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. సహాయక చర్యలకు తోడ్పడటానికి, భూకంప ప్రభావిత ప్రాంతంలో అత్యవసర సేవల కోసం 5,000 మందికి పైగా సిబ్బందిని మోహరించారు.

అలాగే సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ఒక అత్యవసర కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు చైనా ఉపగ్రహాలను, మానవరహిత వైమానిక వాహనాలను (యూఏవీలను) మోహరించిందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ (సీఏఎస్‌సీ) శుక్రవారం తెలిపింది. భారత, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనే ప్రాంతంలో ఉండటం వల్ల, పెళుసైన టిబెటన్ పీఠభూమి శక్తివంతమైన భూకంపాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూకంప కేంద్రం చుట్టూ ఉన్న ప్రాంతం సగటున 4,800 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది.

రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని, భూకంప కేంద్రానికి సమీపంలోని మూడు టౌన్‌షిప్‌ల్లో శనివారం హిమపాతం కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ అధికారులు తెలిపారు. జిన్హువా ప్రకారం.. చైనా అత్యవసర విపత్తు సహాయ నిధుల కింద 50 మిలియన్ యువాన్లను (సుమారు 7.5 మిలియన్ డాలర్లు) కేటాయించింది. భూకంపం తర్వాత పునరుద్ధరణ ప్రయత్నాల కోసం మరో 30 మిలియన్ యువాన్లను ప్రత్యేకంగా కేటాయిం చింది. దేశంలోని అత్యంత ప్రభావవంతమైన స్వచ్ఛంద సంస్థలలో ఒకటైన చైనా ఛారిటీ ఫెడరేషన్, అత్యవసర సహాయక చర్యలకు మద్దతుగా 3 మిలియన్ యువాన్లను (సుమారు 446,561 అమెరికన్ డాలర్లు) తక్షణమే కేటాయించింది.

మరిన్ని వార్తలు