హద్దుమీరుతున్న చైనా

24-10-2026 | 05:35am
  1. అరుణాచల్ సరిహద్దు వెంట ఘర్షణలు
  2. దీటుగా బదులిస్తున్న మన శౌర్య కమాండోలు
  3. గల్వాన్ వంటి ఘటనలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక శిక్షణ
  4. వెల్లడించిన ఐటీబీపీ డీజీ శత్రుజీత్ కపూర్
  5. ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి: ఖర్గే

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఇండియా, చైనా సరిహద్దు వెంట ఘర్షణలు(India China Border Clashes) కొనసాగుతున్నాయని.. చైనా హద్దుమీరుతున్నదని ఇండో బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ కపూర్ అధికారికంగా ప్రకటించారు. జూలై నుంచి ఈ ఘర్షణ వాతావరణం నెలకొందని, ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ వెంట చైనా దురాక్ర మణలకు పాల్పడుతున్నదని, మన సైన్యం దీటుగా బదులిస్తున్నదన్నారు. గల్వాన్ ఘర్షణలు అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించాయి. 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగిందని భావించినప్పటికీ ఇంకా ఘర్షణలు కొనసాగుతున్నాయని డీజీ ప్రకటించడం చర్చకు దారితీసింది. 

దీటుగా బదులిస్తున్నాం..

ఐటీబీపీ సిబ్బందికి ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో డీజీ శత్రుజీత్ కపూర్ మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో చైనా సైన్యం హద్దుమీరుతున్నదని, ఐటీబీపీకి చెందిన మన శౌర్య కమాండోలు గట్టిగా సమాధానం చెప్తున్నారని ఆయన వివరించారు. 

‘గత కొన్ని రోజులుగా అరుణా చల్‌లోని పలు ప్రాంతాల్లో చైనాతో ముఖాముఖి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అవి ఇంకా కంటిన్యూ అవు తున్నాయి. ఐటీబీపీకి చెందిన మన శౌర్య కమాండోలు అసాధారణ పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారు’ అని తెలిపారు. చైనాతో ఉన్న సరిహద్దు మన దేశానికి అత్యంత కఠినమైనదని పేర్కొన్నారు.  గల్వాన్ వంటి ఘటనలను ఎదుర్కొనేందుకు, అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లోనూ పోరాడేందుకు మన సైన్యానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బార్డర్ యూనిట్లలో డ్రోన్ ప్లటూన్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. 

మోదీ సమాధానం చెప్పాలి: కాంగ్రెస్

ఇండియా చైనా సరిహద్దు వెంట చైనా సైన్యం ఘర్షణలకు దిగుతున్నట్లు ఐటీబీపీ డీజీ ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘చైనాకు క్లీన్‌చిట్లు ఎంత కాలం ఇస్తారు? ఇక చాలు. ఇప్పటికైనా మీరు దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి’ అంటూ మూడు ప్రశ్నలను ప్రధాని మోదీకి ‘ఎక్స్’ వేదికగా ఖర్గే సంధించారు.

విశ్వగురువుగా చెప్పుకునే ప్రధాని నరేంద్రమోదీ దేశభద్రతపై మౌనంగా ఉంటున్నారని, చైనాతో పొంచి ఉన్న ముప్పును విస్మరిస్తున్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ కూడా ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ఇప్పటికే లడక్ మాదిరిగానే తామూ పెట్రోలింగ్ పాయింట్లను కోల్పోయామని అరుణాచల్ వాసులు ఆందోళన చెందుతున్నారని, అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు పేర్లను చైనా మారుస్తూనే ఉందని, మన పర్యావరణానికి, నీటికి ఆటంకాలు సృష్టించేలా 60వేల మెగావాట్ల భారీ ప్రాజెక్టును కూడా ఆ దేశం నిర్మిస్తున్నదని ఆయన తెలిపారు. 

ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రశ్నలు ఇవే..

జాతీయ భద్రత: అరుణాచల్ ప్రదేశ్‌లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నాయని సాక్షాత్తు ఐటీబీపీ డీజీ ధ్రువీకరించడాన్ని చూస్తేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డోక్లాం, గల్వాన్ తర్వాత మరో ముప్పు పొంచి ఉందా? గత ఆగస్టులో అరుణాచల్‌లోని తాక్సింగ్ సమీపంలో చైనా చొరబాట్లకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. తర్వాత చర్చలు జరిగినట్లు చెప్తున్నా ఇంకా ఘర్షణలు కొనసాగడం ఆందోళనకరం. మన దేశ పెట్రోలింగ్ ( గస్తీ) మార్గాలకు ఆటంకాలు ఎదురయ్యాయా? భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్  విడదీయరాని భూభాగం. ఇంత జరుగుతున్నా ఎందుకు ప్రధాని మోదీ దాస్తున్నారు? దేశాన్ని ఎందుకు చీకట్లో ఉంచుతున్నారు? 

ఆర్థిక భద్రత: గల్వాన్‌లో 20 మంది భారత సైనికులు ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా 2020 నుంచి మన దేశానికి చైనా దిగుమతులు 102 శాతం పెరిగాయి. అదే సమయంలో చైనాతో ఇండియా వాణిజ్య లోటు (ట్రేడ్ డిఫిసిట్) 155 శాతం పెరిగి.. 112.16 బిలియన్ డాలర్లకు చేరింది. ఇండియా నుంచి ఎగుమతులకు చైనా ఆటంకాలు సృష్టిస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం అంగీకరిస్తున్నారు. అయినా మోదీ ప్రభుత్వం చైనా పెట్టుబడుల కోసం తలుపులు తెరిచింది. ‘మేక్ ఇన్ ఇండియా’ అని చెప్తూనే..  ‘ఇంపోర్ట్ ఫ్రమ్ చైనా’గా తయారు చేస్తున్నారు.  

జవాబుదారీతనం ఏదీ?: కనీసం 23 సార్లు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోదీ మధ్య చర్చలు జరిగాయి. పైగా బ్రిక్స్ వంటి సమావేశాలూ జరిగాయి. ఇంత జరిగితే ఏం సాధించారు? కలిసి ఫొటోలు దిగి పోజులివ్వడం కాదు.. జవాబుదారీతనం కావాలి. మన దళాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఏం జరుగుతున్నదో దేశానికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి.

మరిన్ని వార్తలు