గోల్మాల్ హెచ్‌సీఏ
- రూ.92 కోట్ల అవినీతి
- అక్రమాల కేసులో సీఐడీ ఛార్జిషీట్
- ఫోర్జరీ పత్రాలతో జగన్మోహన్ రావు ఎన్నిక
- టికెట్ల విక్రయాల్లో తేడాలు
- టెండర్ల కేటాయింపులోనూ అవకతవకలు
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఫోర్జరీ పత్రాలతో ఎన్నిక, నకిలీ బంతుల కొనుగోలు, బోగస్ బిల్లులు, టెండర్ల కేటాయింపులో అక్రమాలు, టికెట్ల విక్రయాల్లో భారీ తేడాలు ఇలా కాదేదీ అవినీతికి అనర్హం అన్న రీతిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) పెద్దలు వ్యవహరించారని వెల్లడైంది. హెచ్‌సీఏ అవినీతి, అక్రమాల కేసులో కోర్టుకు సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
మొత్తం 80 పేజీల ఛార్జిషీట్లో భారీ ఆర్థిక అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించి హెచ్‌సీఏకు రూ. 92.08 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఐడీ నిర్ధారించింది. సీఐడీ ఛార్జిషీట్ ప్రకారం.. బీసీసీఐ నుంచి వచ్చిన రూ.211.98 కోట్లతో కలుపుకుని హెచ్‌సీఏకు మొత్తం రూ.257.12 కోట్ల ఆదాయం సమకూరింది. దీనిలో సుమారు రూ.92.08 కోట్ల మేర అక్రమాలకు పాల్పడి అసోసియేషన్‌కు నష్టం చేకూర్చారు. శ్రీ లక్ష్మీ నివాస్ అండ్ కంపెనీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ ఆధారంగా ఈ ఆర్థిక అవకతవకలను గుర్తించారు.
2023 అక్టోబర్ నుంచి 2025 జూన్ వరకూ హెచ్‌సీఏ కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులే ఈ అక్రమాలకు కారణంగా సీఐడీ పేర్కొం ది. అప్పటి హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు, మాజీ సెక్రటరీ దేవరాజ్ రాంచందర్, మాజీ ట్రెజరర్ సీ జగన్నాథ్ శ్రీనివాసరావు, మాజీ సీఈఓ సునీల్ కాంతే పేర్లను ఛార్జీషీట్లో చేర్చింది. జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు, సంతకాలను ఉపయోగించి క్లబ్ మెంబర్షిప్ పొందారని పేర్కొంది. కవిత, రాజేందర్ యాదవ్ సహకారంతో నకిలీ పత్రాల ద్వారా జగన్మోహన్ రావు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ నిర్ధారించింది. తద్వారా అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీ చేసి బాధ్యతలు చేపట్టారని సీఐడీ వెల్లడించింది.
నకిలీ క్రికెట్ బంతుల కొనుగోలు, ప్యాక్డ్ ఫుడ్ కాంట్రాక్టులు, విద్యుత్ సామగ్రి కొనుగోళ్లు, క్యాటరింగ్ సర్వీసుల టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని ఫోరెన్సిక్ నివేదికల ద్వారా స్పష్టమైంది. తక్కువ టెండర్ దాఖలు చేసిన సంస్థలను కాదనీ, ఎక్కువ కోట్ చేసిన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టినట్టు విచారణలో తేలింది. భారత్- టెస్ట్ మ్యాచ్, ఇతర మ్యాచ్‌ల సందర్భంగా టికెట్ల లెక్కల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు సీఐడీ తేల్చింది. 1.90 లక్షల టికెట్ల ముద్రణకు రూ.14.25 లక్షలు చెల్లించారు. దాదాపు 49, 628 టికెట్లకు సంబంధించి లెక్కల్లో తేడాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
క్రికెటర్ల రవాణాకు వాహనాల కోసం అశోకా ట్రావెల్స్‌కు చెల్లించామంటున్న రూ.19 లక్షల సరైన రికార్డుల్లేవు. తమకు ఇంకా రూ.9 లక్షలు రావాలంటూ అశోకా ట్రావెల్స్ నిర్వాహకులు హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా రూ.39.11 కోట్లు ఖర్చు చేశారు. భారత్- మ్యాచ్ సమయంలో రూ.18.5 కోట్ల నగదును విత్ డ్రా చేశారని పేర్కొంది. 169 వైట్ టర్ఫ్ కూకా బుర్రా బంతుల కొనుగోలుకు రూ.19.46 లక్షలు చెల్లించినట్లు రికార్డుల్లో ఉండగా, హరియాణా నుంచి 1,576 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు హుటాహుటిన ఒకేరోజులో వాటిని చేరినట్లు చూపించడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. స్టాక్ రికార్డుల నిర్వహణలో లోపాలతో రూ.94 లక్షలు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది.
ఐపీఎల్ 18వ సీజన్లో ఎస్ఆర్హెచ్ నుంచి అదనంగా 30 ఓనర్స్ లాంజ్ టికెట్లు, మరో 2,500 టికెట్లు డిమాండ్ చేసినట్లు పేర్కొంది. డిమాండ్లు నెరవేరకపోవడంతో 2025 మార్చి 27న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ సమయంలో ఉప్పల్ స్టేడియంలోని ఎఫ్-3 కార్పొరేట్ బాక్స్‌కు తాళం వేసినట్లు తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు పక్కా సాంకేతిక, సాక్ష్యాధారాలను సేకరించారు. మొత్తం 63 మంది కీలక సాక్షుల నుంచి వివరమైన వాంగ్మూలాలను రికార్డు చేశారు. వీటితో పాటు నిపుణులైన చార్టర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని ఈ దర్యాప్తును పూర్తి చేశారు.