మోదీ రాజకీయాలకు సర్ అస్త్రం.. రేవంత్ రెడ్డి ఫైర్!
హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (Special Intensive Revision)ను ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విమర్శించారు. పేదల ఓటు హక్కులకు భంగం కలగకుండా చూడాలని అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కీలక సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎల్నినో ప్రభావం, కరువు పరిస్థితులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు.
రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాల్లో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Elections)కు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. కాంగ్రెస్కు ఎన్నికల్లో గెలుపోటములు కొత్త కాదని, ఓటముల తర్వాత మరింత పట్టుదలతో తిరిగి విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
కరువు ప్రభావం ఒక్కసారిగా కనిపించదని, రోజులు గడిచేకొద్దీ దాని తీవ్రత బయటపడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. కరువు పరిస్థితులపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలోనూ కొన్ని ప్రాంతాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ప్రస్తావించారు.
ఓటు హక్కుపై అవగాహన కల్పించడం, ఓటర్ల జాబితాను సరిచేయడం వంటి లక్ష్యాలతో చేపట్టే ప్రక్రియను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకూడదని సీఎం వ్యాఖ్యానించారు. సర్ పేరుతో పేదల హక్కులకు నష్టం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, కరువు పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విధానాలను వివరించాలని కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది.