కరువు నివారణలో విఫలం
- చేతగాని సీఎంగా రేవంత్ చరిత్రకెక్కుతారు!
- ఎల్ నినోపై ముందస్తు చర్యలేవీ?
- శ్వేతపత్రం విడుదల చేయాలి
- మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) విమర్శించారు. అసమర్థుడికి అధికారం అప్పగిస్తే ఇల్లు పీకి పందిరి వేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. చేతగాని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చరిత్రలో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.
కరువు ప్రకృతి వైపరీత్యమే అయినా.. నివారణ చర్యలు చేపట్టడం, ప్రజలకు భరోసా కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్ నినో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఆరు నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఈ కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కరువుపై ముందే తెలిసినప్పుడు గోదావరి, కృష్ణా నదుల నీటిని నిల్వ చేసుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.
నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పంటలు, పశుగ్రాసం, ఉపాధి కల్పన వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ ప్రకటించకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని నిలదీశారు. కరువు వస్తోందని చేతులెత్తేయడం పాలనా దక్షత కాదని, రైతులను సంక్షోభంలోకి నెట్టడమేనని విమర్శించారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉందన్నారు.
నీటి నిల్వలపై శ్వేతపత్రం..
రాష్ట్రంలోని ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వ లు, తాగునీటి అవసరాలు, సాగునీటి పరిస్థితులు, కరువు నివారణకు కేటాయించిన నిధుల వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.ప్రచార ఆర్భాటాలను పక్కనపెట్టి సమగ్ర కార్యాచరణను ప్రకటించాలని సూచించారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, పశువులకు పశుగ్రాసం, కూలీలకు ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. కరువు వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతో పాటు రైతు బీమా, పంటల బీమా పథకాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరువు పేరుతో వ్యవసాయానికి నీళ్లు అందించలేమని ముందుగానే ప్రకటించడం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు.
రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగాన్ని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని, అదే సమయంలో విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్న పరిస్థితిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ట్యాంకర్ల ద్వారా పంటలకు నీళ్లు అందించేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు. బొగ్గు నిల్వలు తగ్గి విద్యుత్ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత కరువు పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు.
ఎల్ నినో ప్రపంచవ్యాప్త సమస్య అయినప్పుడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నీటి పరిస్థితులు, తెలంగాణలోని రిజర్వాయర్ల పరిస్థితుల మధ్య తేడా ఎందుకు కనిపిస్తోందో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే రేవంత్ రెడ్డిలా చేతులెత్తేసే ప్రకటనలు చేసేవారు కాదన్నారు. వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఒడిసిపట్టి తెలంగాణలో కరువు రాకుండా చూసేవారని, ముందస్తు చర్యలతో విద్యుత్ కోతలను నివారించేందుకు ప్రయత్నించేవారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో నీటి నిర్వహణ, రైతులకు భరోసా కల్పించడం వంటి అంశాలపై తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కరోనా సమయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని హరీశ్ రావు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌కు సహకరించడం, ప్రజల్లో ధైర్యం నింపడం, వలస కూలీలను ఆదుకోవడం వంటి చర్యల ద్వారా అప్పటి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందన్నారు. కరోనా సమయంలో కేసీఆర్ చర్యలపై విమర్శలు చేసే ముందు ప్రస్తుత కరువు పరిస్థితిని ఎదుర్కొనేందుకు రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.