తుమ్మిడిహట్టిపై మహారాష్ట్రతో త్వరలో చర్చలు
- భేటీకి మహారాష్ట్ర సానుకూలం
- 152 మీటర్ల ఎత్తు బరాజ్‌కు ఒప్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయండి
- పూర్తి వివరాలతో రెడీగా ఉండాలి
- ఏదుల నుంచే డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు నీళ్లు
- ‘పాలమూరు’కు విఘాతం కలగకుండా అదనపు జలాల తరలింపు
- శ్రీశైలం మధ్య మరో 0.6 టీఎంసీల లిఫ్టింగ్
- ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
- డిప్యూటీ సీఎం భట్టి,మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు హాజరు
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తుమ్మిడిహట్టి బరాజ్(Tummadihatti Barrage)పై మహారాష్ట్రతో త్వరలోనే చర్చలకు సిద్ధమవుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) వెల్లడించారు. ఈ నెలలోనే సమావేశానికి ఆహ్వానిస్తానని మహా రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంకేతాలిచ్చారని తెలిపారు. అధికారులు అన్ని వివరాలతో సన్నద్ధం కావాలని ఆదేశించారు. 152 మీటర్ల ఎత్తున బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర సర్కార్‌ను ఒప్పించేలా బలమైన వాదనలు సిద్ధం చేయాలని, ముంపు ప్రభావం, నీటి లభ్యత, ఎల్లంపల్లి వరకు నీటి తరలింపు అవకాశాలపై స్పష్టమైన గణాంకాలతో రావాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై శుక్రవారం బోధి పెవిలియన్‌లో ఇరిగేషన్ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహట్టి 152 మీటర్ల ఎత్తున బరాజ్ నిర్మిస్తే ఎంత నీటిని తెచ్చుకునే వీలుంది.. 150 మీటర్ల ఎత్తున ఎంత నీటిని ఎల్లంపల్లివరకు తెచ్చుకోవచ్చనే వివరాలను ఇంజినీర్లు సీఎంకు వివరించారు. బరాజ్ నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో ఎక్కడా గ్రా మాలు ముంపునకు గురయ్యే అవకాశం లేవని స్పష్టం చేశారు. ముంపు ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేసి, సాధ్యమైనంత ఎక్కువ నీటిని తెచ్చుకునేలా బరాజ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మిస్తున్నామని సీఎం వివరించారు. లక్ష్యాన్ని సాధించే సంకల్పంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల చర్చలు, సంప్రదింపులు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఏళ్లకేళ్లు పోరాడిన అటవీ ప్రాంతవాసులందరికీ ఈ ప్రాజె క్టు ద్వారా మేలు జరగాలన్నారు. గతంలోనే 148 మీటర్ల ఎత్తు బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, అంత తక్కువ ఎత్తున నిర్మిస్తే ఆశించినంత నీటిని తెచ్చుకునే వీల్లేదని సీఎం పేర్కొన్నారు.
అందుకే 152 మీటర్ల ఎత్తున బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం, ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల వివరాలు, అక్కడ చర్చించిన అంశాలు, వాళ్లు కోరిన నివేదికలన్నీ వెంటనే సమర్పించాలని ఆదేశించారు. మహారాష్ట్రతో చర్చల సందర్భంగా తెలంగాణ నీటి అవసరాలను తెలియజేసి, మన వాదనను సమర్థంగా వినిపించాలని మంత్రులకు సీఎం సూచించారు.
‘పాలమూరు’కు ఆటంకం కలగొద్దు..
పాలమూరు ప్రాజెక్టుల నీటి వాటాలో కోత పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమయ్యే 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి అదనంగా సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు ఈ అదనపు నీటిని లిఫ్ట్ చేసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఎక్కడెక్కడ పంపులు, పంప్ హౌజ్‌లు అమర్చాలి, ఇప్పుడున్న కాలువలు, టన్నెల్ వ్యవస్థ సామర్థ్యం సరిపోతుందా, లేదా ఎక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవాలనేది వెంటనే అధ్యయనం చేసి.. అందుకు అనుగుణగా డిజై న్లు రూపొందించాలన్నారు. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తీసుకోవాలా... ఏదుల నుంచి డిండికి నీటిని తీసుకోవాలనే విషయంలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రతినిధుల అభ్యంతరాలు, విజ్ఞప్తులపైనా సమావేశంలో చర్చ జరిగింది. నార్లాపూర్ నుంచి నీటిని తరలిస్తే ఎంత ఖర్చవుతుంది, ఏదుల నుంచి తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను ఇరిగేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.