క్యూర్‌లో లక్ష ఇండ్లు
- మూడు విడతల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం
- యుద్ధప్రాతిపదికన స్థలాలు గుర్తించండి
- ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక
- ఆన్‌లైన్‌లో డ్రా, యూట్యూబ్‌లోనూ చూసుకునే అవకాశం
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి.. కలెక్టర్లతో సమీక్ష
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): పేదల ఉపాధికి ఆటంకం కలగకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్లుందని, మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో 500 చొప్పున ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
మొదటి విడత ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని, రెండు, మూడో విడతలకు సంబంధించి కూడా ముందుగానే భూములను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో నివసిస్తున్న పేదల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా, వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని ఈ కార్య్రక్రమం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూనే ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హౌసింగ్ కార్పొరేషన్ ప్రత్యేక సాప్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. తద్వారా లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉంటుందన్నారు. డ్రా ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. డ్రా వివరాలను యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంచాలని, ప్రత్యక్ష ప్రసారం వీక్షించలేని వారికి ఇది సౌలభ్యంగా ఉంటుందని మంత్రి సూచించారు.